ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం.. పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి అసలు నిజం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితురాలు
మన భారత్, రంగారెడ్డి జిల్లా:
చేతిలోని సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తోందని, చెప్పిన మాట వినడం లేదనే కోపంతో ఓ తల్లి కన్నకూతురినే హత్య చేసిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తొలుత బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసిన తల్లి, పోలీసుల విచారణలో చివరకు అసలు విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన కీలక అంశాలు ఈ హత్య ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి.
ఫోన్ విషయంలో తరచూ గొడవలు
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పట్టణంలోని హనుమాన్ కాలనీలో ఆటో డ్రైవర్ ముయ్యడి రాజు, భార్య విజయలక్ష్మి తమ ముగ్గురు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తెల్లో సువర్చల (14) స్థానికంగా తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే తల్లి విజయలక్ష్మికి మద్యపానం అలవాటు ఉండటంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ముఖ్యంగా సువర్చల సెల్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తోందని, తాను చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆమెతో తరచూ వాగ్వాదానికి దిగేదని తెలిసింది.
కోపంతో గొంతు నులిమి హత్య
ఈ నెల 27వ తేదీన ఇంటికి తిరిగి వచ్చిన విజయలక్ష్మికి సువర్చల సెల్‌ఫోన్ చూస్తూ కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె కుమార్తెతో గొడవపడింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి బాలిక గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కుమార్తె మెడకు చీర చుట్టి ఉరివేసుకున్నట్లు కనిపించేలా చేసి, తన భర్త రాజుకు ఫోన్ చేసి సువర్చల ఆత్మహత్య చేసుకుందని తెలిపింది.
ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు
ఇటీవలే సువర్చల పుష్పవతి కావడంతో కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు తొలుత భావించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసును లోతుగా పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన అంశాలు అనుమానాలకు బలం చేకూర్చాయి. దీంతో సాధారణ ఆత్మహత్యగా భావించిన ఘటనను పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో బయటపడిన నిజం
పోలీసులు తల్లిని విచారించగా, ఆమె ప్రవర్తనలో అనుమానాస్పద అంశాలు గుర్తించినట్లు సమాచారం. వరుసగా ప్రశ్నించడంతో చివరకు తానే కుమార్తెను హత్య చేసినట్లు విజయలక్ష్మి అంగీకరించినట్లు తెలిసింది. కుమార్తె తరచూ ఫోన్ చూస్తోందని, తన మాట వినడం లేదనే కారణంతో ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
చిన్న వయసులోనే చదువుకుంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలిక ఇలా కన్నతల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లల ప్రవర్తన, చదువు, సెల్‌ఫోన్ వినియోగం వంటి అంశాలపై తల్లిదండ్రులు ఆగ్రహంతో కాకుండా సహనంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
ఒక చిన్న వివాదం కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోవడం, ఆపై హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరగడం సమాజాన్ని కలచివేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
