manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 12:24 pm Editor : Editor Vishal Kumar

మియాపూర్‌లో 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

రూ.50 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తికి రక్షణ.. తెలంగాణ ప్రజల విజయం: సీఎం రేవంత్ రెడ్డి

మన భారత్, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై సర్వహక్కులు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఈ విజయం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మియాపూర్‌లోని విలువైన ప్రభుత్వ భూములపై కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయని, వాటిని ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని వివరించారు. కాలనీల పేరుతో ప్రభుత్వ పోరంబోకు భూములను సొంతం చేసుకోవాలని జరిగిన ప్రయత్నాలను ప్రభుత్వం న్యాయపోరాటం ద్వారా అడ్డుకుందని తెలిపారు.

రూ.1.50 లక్షల కోట్ల భూములకు రక్షణ

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు న్యాయస్థానాల్లో సమర్థవంతంగా పోరాటం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత మూడేళ్లుగా న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగామని వెల్లడించారు.

మియాపూర్‌లోని 550 ఎకరాలతో పాటు రాష్ట్రంలోని మరో ఆరు ప్రధాన ప్రాంతాల్లో కూడా విలువైన ప్రభుత్వ, అటవీ భూములను న్యాయపోరాటం ద్వారా రక్షించినట్లు వివరించారు. గతంలో ధరణి వ్యవస్థ ముసుగులో రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

కంచ గచ్చిబౌలి, మామిడిపల్లిలోనూ భూముల పరిరక్షణ

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అనేక విలువైన భూములను కాపాడేందుకు ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించిందని సీఎం తెలిపారు. ఐఎంజీ భూముల వ్యవహారంలో ఆక్రమణ ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా అడ్డుకున్నామని చెప్పారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు, మామిడిపల్లిలోని 450 ఎకరాల భూముల విషయంలోనూ సమర్థవంతంగా పోరాడి ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడినట్లు పేర్కొన్నారు.

హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని సర్వే నంబర్ 201లో ఉన్న 140 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం రక్షించిందని తెలిపారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు వివరించారు.

కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల భూమి స్వాధీనం

శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్ 59 పరిధిలో ఉన్న 36 ఎకరాల భూమిపై కూడా కొందరు ఆక్రమణలకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి వెల్లడించారు. దాదాపు రూ.3,600 కోట్ల విలువైన ఈ భూమిని కాపాడేందుకు ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందన్నారు. 2025 సెప్టెంబర్ 3న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిందని, అనంతరం ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గండిపేట మండలం మంచిరేవులలోని సర్వే నంబర్ 393లో ఉన్న 143 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమణల నుంచి రక్షించినట్లు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు సమీపంలో, గ్రేహౌండ్స్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఈ భూమిలో 50 ఎకరాలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయించినట్లు వివరించారు.

అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.400 కోట్ల విలువైన 106 ఎకరాల అటవీ భూమిని గతంలో ఒక రాజకీయ నాయకుడికి అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగాయని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి తిరిగి ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడగలిగామని తెలిపారు.

అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల అటవీ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా, న్యాయస్థానాల్లో పోరాడి ఆ భూములను రక్షించినట్లు వివరించారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు భవిష్యత్తులో తిరిగి ఆక్రమణలకు గురికాకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజాప్రయోజనాలకే ప్రభుత్వ భూముల వినియోగం

న్యాయపోరాటం ద్వారా సాధించుకున్న భూములను నిర్లక్ష్యంగా వదిలేస్తే తిరిగి ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అందువల్ల భూములను గుర్తించి, వాటి స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖలకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీ శాఖకు చెందిన భూములను ఆ శాఖకు, రెవెన్యూ శాఖకు చెందిన భూములను సంబంధిత శాఖకు అప్పగిస్తామని తెలిపారు.

ప్రభుత్వం రక్షించిన భూములను ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎలా వినియోగించాలనే అంశంపై వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని వెల్లడించారు. అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న అనంతరం భూముల వినియోగంపై ముందుకు వెళ్తామని చెప్పారు.

ఈ భూముల ద్వారా సమకూరే వనరులను ప్రధానంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతికి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు కూడా నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆస్తులు కొందరి వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు మరింత బలాన్ని ఇస్తుందని, ప్రజల ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.

మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్ న్యూఢిల్లీ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 



(adsbygoogle = window.adsbygoogle || []).push({});