రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం కల్పించిన కవిత.. ఎన్నికల బాధ్యతల కోసం ప్రత్యేక కమిటీలు
హైదరాబాద్, అక్టోబర్ 30 (మన భారత్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇప్పటికే వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కవిత, రెండో స్థానంలోనూ బీసీ అభ్యర్థికే అవకాశం కల్పించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘును ఎన్నికల అబ్జర్వర్, కోఆర్డినేటర్‌గా నియమించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల వ్యూహరచన, ప్రచార ప్రణాళిక, సమన్వయ బాధ్యతలను ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లకు అప్పగించారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల కార్యాచరణను రూపొందిస్తూ వివిధ స్థాయిల్లో నాయకులకు బాధ్యతలు కేటాయించింది.
ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసేలా ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జీలను నియమించారు. హైదరాబాద్ జిల్లాకు సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్‌లకు బాధ్యతలు అప్పగించారు. రంగారెడ్డి జిల్లాకు అర్చనా సేనాపతి, మహబూబ్‌నగర్ జిల్లాకు రంజిత్ గొంగళ్లను ఇన్‌చార్జీలుగా నియమించారు.
అదేవిధంగా వరంగల్ జిల్లాకు మాడుగుల రాజిరెడ్డి, ఖమ్మం జిల్లాకు గట్టు కరుణ, నల్గొండ జిల్లాకు సుజిత్‌ను బాధ్యులుగా ప్రకటించారు. ఆయా జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడం, పట్టభద్రులను కలవడం, అభ్యర్థులకు మద్దతు కూడగట్టడం వంటి కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.
రెండు దశాబ్దాల జర్నలిజం అనుభవం
హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన ఆకాశ్ కొల్లూరు హైదరాబాద్‌కు చెందినవారు. జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో సుమారు రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా పనిచేస్తూ వార్తా రంగంలో తనదైన గుర్తింపు పొందారు. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీఎన్ఎన్ న్యూస్ 18, డైలీహంట్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. విద్యారంగంలో ప్రతిభతో పాటు మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిగా ఆయనను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం విశేషం.
బీసీ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించడం ద్వారా పట్టభద్రుల ఎన్నికల్లో సామాజిక ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక వ్యూహకర్తలు, అబ్జర్వర్లు, జిల్లా ఇన్‌చార్జీలను నియమించడం ద్వారా ముందస్తు కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పట్టభద్రులను కలిసి తమ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బలమైన ప్రచార వ్యూహంతో ముందుకు సాగాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
