కలెక్టర్ ఆదేశాలతో అధికారుల సమక్షంలో పరిశీలన
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 30, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తూకాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు మార్కెట్‌లోని అన్ని కాంటాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, రైతుల సమక్షంలో శుక్రవారం ఈ తనిఖీలు నిర్వహించారు.
మార్కెట్ యార్డులో వినియోగంలో ఉన్న ప్రతి కాంటాను పరిశీలించి, తూకాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అంశాన్ని అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం ఐదు కిలోల పర్మిసబుల్ ఎర్రర్ (అనుమతించదగిన గరిష్ఠ తేడా) పరిమితిని పరిగణనలోకి తీసుకొని కాంటాల పనితీరును పరీక్షించినట్లు చైర్మన్ తెలిపారు.
తనిఖీల్లో మార్కెట్ యార్డులో ఉన్న ఏ ఒక్క కాంటాలోనూ తూకానికి సంబంధించి ఎలాంటి తేడాలు, సాంకేతిక లోపాలు గుర్తించలేదని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. రైతులు తమ పంటలను విక్రయించే సమయంలో తూకాల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
తనిఖీలకు సంబంధించిన వివరాలు, పరిశీలన అంశాలతో సమగ్ర నివేదికను రూపొందించి త్వరలోనే జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు అధికారికంగా అందజేయనున్నట్లు తెలిపారు. మార్కెట్‌లో తూకాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యార్డులోని అన్ని విభాగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని, తూకాల విషయంలో పూర్తి పారదర్శకత ఉండేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎండీ అజీజ్ పాషా, లీగల్ మెట్రాలజీ విభాగం అధికారి నవీన్ రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి విట్టల్, స్వామి, హసన్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
