manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:21 pm Editor : Editor Vishal Kumar

రేకులకుంట అభివృద్ధికి రూ.2.8 కోట్లతో పనులు చేపట్టాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి

గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముంటిమడుగు కేశవరెడ్డి

మన భారత్, బుక్కరాయసముద్రం:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీ పరిధిలోని రేకులకుంట గ్రామంలో ఆయన ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరస నాయుడుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.

గ్రామంలోని రామాలయం వద్ద ప్రారంభమైన ప్రచారం బీసీ కాలనీ, ఆంజనేయస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు, ఎస్సీ కాలనీల మీదుగా కొనసాగింది. ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను, ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

రూ.2.8 కోట్లతో అభివృద్ధి పనులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేకులకుంట గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కేశవరెడ్డి తెలిపారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల కోసం మొత్తం రూ.2.8 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

ఎస్సీ కాలనీలో నాలుగు సీసీ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ధోబీఘాట్ ఏర్పాటు, బీసీ కాలనీ సమీపంలో రెండు బోర్లు తవ్వించి పంప్‌సెట్లను ఏర్పాటు చేయడం ద్వారా నీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పెద్దమ్మ ఆలయం సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు పల్లె పండుగ–1, పల్లె పండుగ–3 కార్యక్రమాల కింద గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు.

గ్రామంలో మూడు గోకులం షెడ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించే దిశగా ఇద్దరు రైతులకు ఐదు ఎకరాల్లో ఉద్యానవన పథకం ద్వారా లబ్ధి చేకూరినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి పథకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం

రేకులకుంట–పసులూరు–సిద్ధరాంపురం గ్రామాల మధ్య 6.35 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కేశవరెడ్డి వివరించారు. ఈ రహదారి ద్వారా ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కేశవరెడ్డి ప్రజలను కోరారు. రెడ్డిపల్లి ఎంపీటీసీ కూటమి అభ్యర్థి నారాయణస్వామికి, బుక్కరాయసముద్రం జడ్పీటీసీ కూటమి అభ్యర్థి ఉజ్జినమ్మకు బ్యాలెట్ నంబర్‌ 1లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. రేకులకుంట గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});