manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:32 pm Editor : user5442714

కంబ్లె రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: మాజీ మంత్రి జోగు రామన్న

కంబ్లె రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: మాజీ మంత్రి జోగు రామన్న




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. బాధిత కుటుంబానికి ఉద్యోగం, నష్టపరిహారం అందించాలని డిమాండ్

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29

ఎంబీఏ విద్యార్థి కంబ్లె రాహుల్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఉద్యోగంతో పాటు రాతపూర్వక ఒప్పందం ద్వారా నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు. రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

గురువారం రిమ్స్ ఆస్పత్రి ఎదుట కంబ్లె రాహుల్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కాలనీవాసులు, వివిధ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో టూ టౌన్ పోలీసుల వ్యవహారశైలిని కూడా నిరసించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆందోళన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. వివిధ సంఘాల నాయకులతో కలిసి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం రిమ్స్‌లో జాయింట్ కలెక్టర్, ఆస్పత్రి డైరెక్టర్‌ను కలిసి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. రాహుల్ మృతికి దారితీసిన పరిస్థితులను పూర్తిస్థాయిలో పరిశీలించి, వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా అధికారులు చొరవ చూపాలని కోరారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

రాహుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జోగు రామన్న వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి ఉద్యోగం, నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో బాధిత కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు చేపట్టే తదుపరి కార్యాచరణకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, సాజి తోద్దీన్, అన్నెల వసంత్, చందాల రాజన్న, దమ్మాపాల్, కొండ గణేష్, బట్టు సతీష్, దివిటి రాజు, బుట్టి శివ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});