manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:30 pm Editor : user5442714

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస చోరీలు.. ఐదుగురు నిందితుల అరెస్ట్

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వరుస చోరీలు..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఐదుగురు నిందితుల అరెస్ట్

12 చోరీ ఘటనల్లో ప్రమేయం.. 4 ద్విచక్ర వాహనాలు, 3 మొబైల్ ఫోన్లు, 50 కిలోల ఇత్తడి, రూ.8 వేల నగదు స్వాధీనం

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 29

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన ఐదుగురు నిందితులను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు బాల నేరస్థులు ఉన్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా వెల్లడించారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.8 వేల నగదు, సుమారు 50 కిలోల ఇత్తడి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఆలయాలు, ఇళ్లే లక్ష్యంగా చోరీలు

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితులు వివిధ ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటూ ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆలయాల్లో హుండీల నగదు, ఇత్తడి సామగ్రి, ఇళ్లలో నగదు, బంగారు, వెండి వస్తువులతో పాటు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. దుకాణాల్లోకి చొరబడి వస్తువులు దొంగిలించిన ఘటనలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. చోరీ చేసిన నగదును జల్సాలకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

12 చోరీ ఘటనల్లో నిందితుల ప్రమేయం

1. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయం: అక్టోబర్ 14న ఆలయ తలుపులు పగులగొట్టి ధ్వజస్తంభానికి ఉన్న ఇత్తడి తొడుగుతో పాటు హుండీలోని రూ.2,000 నగదును అపహరించారు.

2. మావల కాలనీ: జూలై 6న ఓ ఇంటి తాళం పగులగొట్టి రూ.13,000 నగదు, వెండి కడియం, గొలుసులను దొంగిలించారు. అనంతరం పక్కింట్లోకి చొరబడి మరో రూ.5,000 నగదును అపహరించారు.

3. మావల కాలనీ: జూలై 8న మరో ఇంటి తాళం పగులగొట్టి రూ.10,000 నగదు, బంగారు ఉంగరాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.

4. ధన్నూర్ గ్రామం: సెప్టెంబర్ 12న ఇంటి ముందు పార్క్ చేసిన హోండా షైన్ ద్విచక్ర వాహనాన్ని అపహరించారు.

5. గిర్నూర్ గ్రామ శివారు: సెప్టెంబర్ 17న వైన్ షాప్ షట్టర్‌ను కత్తిరించి లోపలికి చొరబడి చిల్లర నగదును దొంగిలించారు.

6. నారాయణపూర్ గ్రామం: సెప్టెంబర్ 27న ఇంటి ముందు పార్క్ చేసిన హోండా షైన్ మోటార్ సైకిల్‌తో పాటు మరో ఇంటి ఆవరణలో ఉన్న రెండు మొబైల్ ఫోన్లను అపహరించారు.

7. సుంకిడి గ్రామ శివారు: అక్టోబర్ 17న అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు పగులగొట్టి హుండీలోని రూ.2,500 నగదును దొంగిలించారు.

8. ఆదిలాబాద్ పట్టణం: అక్టోబర్ 23న దేవి రెస్టారెంట్ ఎదుట పార్క్ చేసిన పల్సర్ మోటార్ సైకిల్‌ను అపహరించారు.

9. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ సమీపం: బట్టలు విక్రయించే దుకాణంలో నుంచి కొత్త దుస్తులను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.

10. సారంగాపూర్ బస్టాండ్ ప్రాంతం: అదే రోజు రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన మరో ద్విచక్ర వాహనాన్ని అపహరించారు.

11. వైఎస్సార్ కాలనీ: కాపర్ వైర్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

12. మేడిపల్లి గ్రామం: నిర్మల్ మండల పరిధిలోని మేడిపల్లిలో ఇత్తడి సామగ్రిని దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుల్లో ముగ్గురు బాల నేరస్థులు

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఉమర్‌ఖేడ్ తాలూకా చటారి గ్రామానికి చెందిన అరుణ్ చవాన్, అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు, ఆర్ని ప్రాంతానికి చెందిన 15, 10 ఏళ్ల బాలురు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ప్రాంతానికి చెందిన నిదాన్ పూర్ క్రిష్ణ అలియాస్ బారిక్య మరో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చోరీ సొత్తు స్వాధీనం

నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.8,000 నగదు, సుమారు 50 కిలోల ఇత్తడి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బెల్లూరి ఆలయం నుంచి అపహరించిన ఇత్తడిని మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్‌కు చెందిన వ్యాపారి సయ్యద్ ఝా వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. ఈ కేసుల దర్యాప్తులో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});