అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌ను ఓటరుగా నమోదు చేయించాలి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దరఖాస్తుల ఆమోదం పొందే వరకు బాధ్యత తీసుకోవాలి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మన భారత్, జనగామ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేవలం దరఖాస్తులు సమర్పించడంతో సరిపెట్టుకోకుండా, వాటికి ఆమోదం లభించే వరకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఓటరు నమోదు ప్రక్రియ నుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
**ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి**
గతంలో 2015లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, 2021 ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులు ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి పనిచేశాయని తెలిపారు. గ్రామాల్లో పట్టభద్రుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వారు ఇతరులపై ప్రభావం చూపగలరని పేర్కొన్నారు. అందువల్ల ఈ ఎన్నికను సాధారణంగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.
ఓటరు నమోదు కార్యక్రమ పురోగతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారని పల్లా వెల్లడించారు. కళాశాలలను సంప్రదించడంతోపాటు సంబంధిత అధికారులను కలిసి అర్హులైన గ్రాడ్యుయేట్ల నమోదుకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో కోఆర్డినేటర్లను నియమించి బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
పార్టీలో అందరూ కేసీఆర్ గ్రూపే
పార్టీలో వ్యక్తిగత వర్గాలు లేవని, అందరూ కేసీఆర్, బీఆర్ఎస్ గ్రూపేనని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పార్టీకి అనుకూలంగా ఉన్నవారితోపాటు తటస్థంగా ఉన్న అర్హులైన పట్టభద్రులను కూడా గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఇతరులు పనిచేస్తారనే భావనతో ఎవరూ తమ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని అన్నారు.
దరఖాస్తుల ఆమోదమే కీలకం
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు నిబంధనల ప్రకారం డిగ్రీ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఫొటో తదితర అవసరమైన పత్రాలను సమర్పించాలని పల్లా సూచించారు. దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత అధికారులు కోరిన పత్రాలను అందించి, ఆమోదం పొందే వరకు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. దరఖాస్తు చేయించడం సగం పని మాత్రమేనని, ఆమోదం పొందడం మిగిలిన సగం పనిగా భావించాలని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి అనే వివరాలతో జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాలవారీగా నమోదు పురోగతిని సమీక్షించి, సంబంధిత వివరాలను ఎన్నికల ఇన్చార్జి నాగూర్ల వెంకటేశ్వర్లుకు అందించాలని కోరారు.
ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పల్లా విమర్శలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు.
ఈ నెల 30, 31 తేదీల్లోగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేయాలని, నవంబర్ 1 నుంచి 6 వరకు దరఖాస్తుల ఆమోదంపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో రోజుకు గంట లేదా రెండు గంటలు కేటాయించి పట్టభద్రులను గుర్తించడం, దరఖాస్తులు చేయించడం, ఆమోదం పొందే వరకు పర్యవేక్షించడం వంటి పనులను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
