manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 5:07 am Editor : user5442714

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటి కొరత నివారణకు ముందస్తు ప్రణాళిక

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటి కొరత నివారణకు ముందస్తు ప్రణాళిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమీక్ష

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో తాగునీటి వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపల్ పరిధిలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌), మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమీక్ష నిర్వహించారు. రానున్న కాలంలో తాగునీటి అవసరాలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, నీటి సరఫరా వ్యవస్థ పరిస్థితి, ప్రత్యామ్నాయ వనరుల గుర్తింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ప్రస్తుతం కొనసాగుతున్న నీటి సరఫరా వ్యవస్థలో సాంకేతిక సమస్యలు, నీటి వనరుల కొరత లేదా ఇతర కారణాలతో అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాల్లోని ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల (OHSR)కు అనుసంధానంగా అవసరమైన ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే గుర్తించాలని పేర్కొన్నారు.

నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి, ఆయా ప్రాంతాలకు అవసరమైన నీటి వనరులు, సరఫరా మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని సరఫరా చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో సమస్యపై వేగంగా స్పందించే విధంగా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని పాయల్ శంకర్ సూచించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్ నీటి సరఫరా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. రానున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});