వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా.. 18 కేసులు నమోదు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
13 మండలాల్లో 25 పోలీసు బృందాలతో ఏకకాలంలో ఆకస్మిక దాడులు
ప్రామిసరీ నోట్లు, చెక్కులు, స్టాంప్ పేపర్లు, రిజిస్టర్లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం
లైసెన్సు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: జిల్లాలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం 13 మండలాల్లో 25 పోలీసు బృందాలు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో మొత్తం 18 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వడ్డీ వ్యాపారుల వద్ద తనిఖీల సందర్భంగా ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు, స్టాంప్ పేపర్లు, రిజిస్టర్లు, స్థలాలు, ఇళ్లకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా రుణ లావాదేవీలు నిర్వహించడం వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
లైసెన్సు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను అడ్డుకునేందుకు పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు.
ఏయే పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు?
– ఆదిలాబాద్ వన్‌టౌన్: 3 కేసులు
– ఆదిలాబాద్ టూటౌన్: 3 కేసులు
– మావల: 4 కేసులు
– ఆదిలాబాద్ రూరల్: 1 కేసు
– జైనథ్: 1 కేసు
– బేల: 1 కేసు
– బోథ్: 1 కేసు
– ఉట్నూర్: 2 కేసులు
– గుడిహత్నూర్: 1 కేసు
– నార్నూర్: 1 కేసు
– నేరడిగొండ: 1 కేసు
పోలీసుల ప్రకారం, కేసులు నమోదైన వారిపై తెలంగాణ ఏరియా మనీ లెండర్స్ యాక్ట్, 1349లోని సెక్షన్ 3(5)(బి) కింద చర్యలు చేపట్టారు.
కేసులు నమోదైన వారి వివరాలు
ఆదిలాబాద్ వన్‌టౌన్ పరిధి: ఎస్‌కే సాజిద్ @ సాజిత్ గౌడ్, ఎర్రోజు కేశవ్, ఓరగంటి రఘు.
ఆదిలాబాద్ టూటౌన్ పరిధి: టాపిక్ అహ్మద్ @ జన్ను, షేక్ అక్బర్.
మావల పరిధి: దుర్గా శేఖర్ రెడ్డి, దాసరి నరోత్తం, చిట్టి రాజేశ్వర్, షేక్ ఆసిఫ్.
ఆదిలాబాద్ రూరల్: అజయ్ కుమార్ గాడ్సే, రాంపూర్.
జైనథ్: ఆత్మకూరు అమరేందర్.
బేల: కార్తీక్.
బోథ్: ఈ. రమేష్, సాయినగర్, బోథ్.
ఉట్నూర్: సాయి రెడ్డి, దంతనపల్లి; ఇప్ప సంతోష్.
నేరడిగొండ: కలాలి వెంకటరమణ, వడూర్.
నార్నూర్: అరే అశ్విని.
గుడిహత్నూర్: కేంద్రీ రాహుల్, మన్నూరు.
జిల్లాలో వడ్డీ వ్యాపారాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహించే వారిపై తనిఖీలు, కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ప్రజలు అధిక వడ్డీలకు రుణాలు తీసుకునే ముందు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
