బట్టిసావర్గాం పంచాయతీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు
మన భారత్, మావల: అక్టోబర్ 26, మావల మండలంలోని బట్టిసావర్గాం గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ దర్శనాల అశమ్మ జిల్లా పాలనాధికారిని కోరారు. ఈ మేరకు ఆమె జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీ పరిపాలనా ఖర్చులకు సంబంధించి కార్యదర్శి పిలుపు మేరకు అక్టోబర్ 21న పంచాయతీ కార్యాలయానికి వెళ్లినట్లు అశమ్మ తెలిపారు. మొత్తం ఆరు చెక్కులపై సంతకాలు చేయాలని కోరగా, నాలుగు చెక్కులకు సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే విద్యుత్ బల్బుల కొనుగోలుకు సంబంధించిన నోటిఫైల్ నంబర్లు 34/2026, 37/2026 కింద ఉన్న రూ.21,000, రూ.20,780 విలువైన రెండు చెక్కులపై అనుమానాలు ఉండటంతో సంతకాలు చేయలేదని తెలిపారు.
36 వాట్ల ఎల్‌ఈడీ బల్బు మార్కెట్‌లో సుమారు రూ.650కు లభిస్తుండగా, పంచాయతీ రికార్డుల్లో ఒక్కో బల్బుకు రూ.1,320 చొప్పున బిల్లులు చూపించినట్లు ఆమె ఆరోపించారు. ప్రస్తుతం మార్కెట్‌లో లేని దుకాణం పేరుతో బిల్లులు రూపొందించారనే అనుమానాలను కూడా వినతిపత్రంలో వ్యక్తం చేశారు. గతంలో ఎస్‌ఈడీ బల్బుల కొనుగోలు విషయంలోనూ ఇలాంటి బిల్లుల ద్వారా చెక్కులు డ్రా చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఈ అంశంపై గతంలో జూన్ 8, 2026న అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు, విచారణకు ఆదేశాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని అశమ్మ తెలిపారు. ఈ వ్యవహారం అప్పట్లో పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ పంచాయతీ స్థాయిలో చర్యలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రతి నెల ట్రాక్టర్ డీజిల్, తాగునీటి సరఫరా ఖర్చుల పేరుతో పంచాయతీ నుంచి చెక్కులు జారీ చేస్తున్నారని, కొన్ని ఖర్చులకు జీఎస్టీ వివరాలు లేని బిల్లులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఖాతా నుంచి సర్పంచ్‌కు అనుకూలంగా ఉన్న వ్యక్తుల సొంత వాహనాలకు డీజిల్ వినియోగిస్తున్నారనే ఆరోపణలను కూడా వినతిపత్రంలో ప్రస్తావించారు.
గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, చెక్కులు, కొనుగోళ్ల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఉప సర్పంచ్ కోరారు. ప్రజా ధనానికి సంబంధించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
గమనిక: సర్పంచ్‌పై చేసిన ఆరోపణలు ఉప సర్పంచ్ సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నవే. ఆరోపణలపై అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.
