manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 3:13 pm Editor : user5442714

కొమరం భీమ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఆదివాసీల హక్కుల పరిరక్షణతో పాటు అభివృద్ధికి కృషి చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్, అక్టోబర్ 26:

ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొమరం భీమ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం కొమరం భీమ్ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడంతో పాటు గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసీల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు జోగు రామన్న తెలిపారు. గిరిజన కుటుంబాలకు భూములు, రైతుబంధు ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు అటవీ హక్కు పత్రాల పంపిణీ ద్వారా భూమిపై హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

జోడేఘాట్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో పర్యటించి కొమరం భీమ్‌కు నివాళులర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రూ.25 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసినట్లు జోగు రామన్న పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీమ్ పేరు పెట్టడం, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రూ.5 కోట్లతో ఆదివాసీ భవన్ నిర్మించడం వంటి చర్యల ద్వారా గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు.

కొమరం భీమ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమం, అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని జోగు రామన్న కోరారు. గిరిజన సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చొరవ చూపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అజేయ్, ప్రకాష్, పరమేశ్వర్, కుమ్రా రాజు, కౌన్సిలర్ ఆత్రం వెంకటేష్, కొమ్ర శీను, అనేలా వసంత్, ప్రహ్లాద్, యూనిస్ అక్బాని, సలీమ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.