manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 6:59 pm Editor : user5442714

అదనపు కట్న వేధింపుల కేసు నమోదు.. విషం తాగి వివాహిత ఆత్మహత్య

భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు

చిట్యాల, మన భారత్ ప్రతినిధి:జయశంకర్ భూపాలపల్లి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు పెట్టిన మానసిక, శారీరక వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన చిట్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై చిట్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కొడిమాల మహేందర్ తన కుమార్తె కావ్యను ములుగు జిల్లా అమ్మవారిపేటకు చెందిన మల్లెబోయిన రామకృష్ణకు ఇచ్చి 2023 నవంబర్ 23న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 లక్షల విలువైన ప్లాట్‌తో పాటు రెండు తులాల బంగారం, నగదు కట్నంగా ఇచ్చినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది.

కొంతకాలంగా మరో రూ.10 లక్షలు అదనపు కట్నంగా తీసుకురావాలని భర్త రామకృష్ణ, అత్త సమ్మక్క, మామ మొగలి, బావ రాజశేఖర్, ఆడపడుచు నిర్మల వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. గత ఆరు నెలలుగా దంపతులు చిట్యాలలో అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పటికీ వేధింపులు కొనసాగినట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 20న దసరా పండుగ సందర్భంగా కావ్య తన భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లిన సమయంలోనూ అదనపు కట్నం ఇవ్వాలని భర్త ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం చిట్యాలకు తిరిగి వచ్చిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తూ, దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య అక్టోబర్ 24న ఉదయం సుమారు 9 గంటలకు పురుగుల మందు తాగింది.

కుటుంబ సభ్యులు ఆమెను తొలుత పరకాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, అక్టోబర్ 25న ఉదయం 11 గంటల సమయంలో రఘునాథపల్లి సమీపంలో మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్‌ఐ సతీష్ వెల్లడించారు.