manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 11:23 am Editor : user5442714

చిన్న బతుకమ్మ.. పెద్ద సందేశం

నీటిని పొదుపుగా వాడుదాం.. కరువును జయిద్దాం అంటూ సందేశం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 24: తలమడుగు మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో చిన్నారి వేదస్వి రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సంరక్షణ ఆవశ్యకతను తెలియజేసేలా చిన్నారి వేదస్వి తన బతుకమ్మను ప్రత్యేకంగా అలంకరించింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో “నీటిని పొదుపుగా వాడుదాం.. కరువును జయిద్దాం” అనే సందేశాన్ని బతుకమ్మ ద్వారా చాటిచెప్పింది.

అంతేకాకుండా దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులు, దేశ సరిహద్దులను కాపాడే సైనికుల సేవలను స్మరిస్తూ “జై జవాన్.. జై కిసాన్” అనే నినాదాన్ని బతుకమ్మపై అందంగా ఏర్పాటు చేసింది. సంప్రదాయ బతుకమ్మకు సామాజిక బాధ్యత, నీటి సంరక్షణ, రైతులు–సైనికుల పట్ల గౌరవం వంటి అంశాలను జోడించడం పలువురిని ఆకట్టుకుంది.

వేలాది బతుకమ్మల మధ్య చిన్నారి వేదస్వి రూపొందించిన ఈ ప్రత్యేక బతుకమ్మ సందేశాత్మకంగా నిలిచి చూపరుల దృష్టిని ఆకర్షించింది. పండుగ సందర్భంగా కేవలం అలంకరణకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. చిన్నారి ఆలోచనను స్థానికులు, వేడుకలకు హాజరైన ప్రజలు ప్రశంసించారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad