manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 10:22 am Editor : Editor Vishal Kumar

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది: మధుయాష్కి

న్యాయవాదుల సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించేలా సీఎంతో చర్చిస్తాం

కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసుల నివారణకు జాతీయస్థాయిలో ప్రత్యేక లీగల్ టీం

హైదరాబాద్, అక్టోబర్ 24 (మన భారత్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు పోషించిన పాత్ర మరువలేనిదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణీత గడువులో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నాంపల్లిలోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదులు ఢిల్లీ పార్లమెంట్ వరకు వెళ్లి పోరాటం చేశారని, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలోనూ న్యాయవాదుల సహకారం ఉందన్నారు. న్యాయవాదులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించే ధోరణిలో కాకుండా, హక్కుల సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.

అడిషనల్ పీపీ నియామకాల్లో సామాజిక న్యాయం

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ) నియామకాల్లో 60 శాతం కటాఫ్ మార్కుల నిబంధనను తగ్గించాలన్న డిమాండ్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా తగిన అవకాశాలు కల్పించాలన్న న్యాయవాదుల అభ్యర్థనలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని పేర్కొంటూ, ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన న్యాయవాదులకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

కార్యకర్తలపై కేసుల పరిష్కారానికి ప్రత్యేక లీగల్ టీం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై, ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జాతీయస్థాయిలో ప్రత్యేక లీగల్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు మధుయాష్కి గౌడ్ వెల్లడించారు. ఈ విషయంపై రాహుల్ గాంధీతో కూడా చర్చించినట్లు తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ శ్రేణులపై నమోదైన కేసుల వివరాలను సేకరించి, వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పార్టీ లీగల్ టీంకు సూచించారు. సంబంధిత కేసుల సమాచారాన్ని సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి అందజేయడం ద్వారా న్యాయపరమైన పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు భాగస్వాములు కావాలి

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఓటు హక్కులకు విఘాతం కలుగుతోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటంలో న్యాయవాదులు భాగస్వాములు కావాలని మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. ఇది కేవలం ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధించిన అంశం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ అస్తిత్వాన్ని కాపాడుకునే పోరాటమని అభివర్ణించారు.

అలాగే మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమం, సామాజిక న్యాయం, పార్టీ కార్యకర్తలకు న్యాయపరమైన అండ కల్పించడం వంటి అంశాలపై కాంగ్రెస్ లీగల్ సెల్ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.