manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 8:30 am Editor : user5442714

రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం..

రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం
నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు: కలెక్టర్ రాజర్షి షా




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23,

రాబోయే రబీ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నీటి లభ్యతపై ప్రభావం పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులకు అనుకూలమైన పంటల సాగుపై దిశానిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో రబీ సీజన్‌కు సంబంధించిన అంశాలపై మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రబీలో పంటల సాగు, నీటి లభ్యత, రైతులకు కల్పించాల్సిన అవగాహన తదితర అంశాలపై చర్చించారు.

తక్కువ నీటితో సాగయ్యే పంటలపై అవగాహన

రబీ కాలంలో నీటి వినియోగాన్ని తగ్గించే విధంగా ఆరుతడి పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలు, వాటి సాగు విధానాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, సాగునీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపికపై రైతులకు సూచనలు అందించాలని అన్నారు. నీటి కొరత కారణంగా పంటలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడులు, దిగుబడులకు రక్షణ కల్పించేలా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని సూచించారు.

వాతావరణ మార్పులపై ముందస్తు చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ రంగంపై దాని ప్రభావాన్ని అధికారులు నిరంతరం పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. మండలాలు, గ్రామాల వారీగా పరిస్థితులను అంచనా వేసి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు.

రబీ సాగు ప్రారంభానికి ముందే రైతులకు పంటల ఎంపిక, నీటి పొదుపు, సాగు పద్ధతులు, వాతావరణ ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సమాచారం సకాలంలో చేరేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad