ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం.. 27న భారీ పాదయాత్ర
బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మన భారత్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డును తరలించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం, 27న భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే జవహర్‌నగర్‌లో సకల జనుల సమ్మె చేపడతామని హెచ్చరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
డంపింగ్ యార్డు సమస్యపై సన్నాహక సమావేశం
దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై సన్నాహక సమావేశం జరిగింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ నాయకులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు. బాధితుల సమస్యలపై పత్రికలు, మీడియా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజారోగ్యంపై ఆందోళన
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కీసర, ఘట్‌కేసర్, దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం కొనసాగుతోందని, డంపింగ్ యార్డు నుంచి వెలువడే కలుషిత నీరు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చెరువుల్లో చేపలు చనిపోవడం, గర్భిణులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయనే ఫిర్యాదులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న వాయువులు, లీచేట్ ప్రభావాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కేంద్రం దృష్టికి సమస్య
ఈ అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావించానని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక నివేదికతో రావాలని సూచించినట్లు బీజేపీ నేత తెలిపారు. సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, దుర్వాసన, కలుషిత నీటి సమస్యలు తగ్గించే పద్ధతులను అమలు చేయాలని కోరారు. ఇందుకోసం ఆర్థిక పరిమితులను సాకుగా చూపకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్ నగర ప్రతిష్ఠకు భంగం కలగకుండా చెత్త నిర్వహణకు సమర్థవంతమైన విధానం తీసుకురావాలని సూచించారు.
ప్రజల కోసం ఐక్యంగా పోరాటం
పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. హైడ్రా చర్యలు, మూసీ అభివృద్ధి, పాత అపార్ట్‌మెంట్లను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి అంశాల్లోనూ బీజేపీ ప్రజల తరఫున పోరాడిందని తెలిపారు. జవహర్‌నగర్ సమస్యపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్ రావు పూర్తి మద్దతు ప్రకటించారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఉద్యమంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, అర్బన్ జిల్లా అధ్యక్షుడు డి. గిరివర్ధన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గండే తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
