manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 1:02 pm Editor : Editor Vishal Kumar

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి వేగం పెంచాలి: సీఎం

మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ప్రయత్నాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

మన భారత్, తెలంగాణ: తెలంగాణలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు వెనుకబడిన అటవీ, గిరిజన ప్రాంతాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరగనున్న చర్చలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల సూచనప్రాయంగా తెలిపినట్లు సీఎం వెల్లడించారు.

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష

రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నీటి లభ్యత, నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై ప్రధానంగా చర్చించారు.

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకోవచ్చు, 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు ఎంత నీటిని తరలించవచ్చనే అంశాలను ఇంజనీర్లు వివరించారు. బ్యారేజీ ఎత్తును బట్టి నీటి లభ్యత, ముంపు విస్తీర్ణంలో ఉండే తేడాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

ముంపు ప్రభావాన్ని అంచనా వేయాలి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని అధికారులు వివరించినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సుమారు 2,300 ఎకరాల భూములు ముంపు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని, 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే వెయ్యి ఎకరాల్లోపు భూములపై ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఈ అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, ముంపు ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గిస్తూనే తెలంగాణకు ఎక్కువ నీటిని అందించే విధంగా ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించినప్పటికీ, ఆ ఎత్తులో నిర్మిస్తే ఆశించిన స్థాయిలో నీటిని వినియోగించుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు వివరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

రెండు లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

అటవీ, గిరిజన ప్రాంతాలతో కూడిన అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో హక్కుల కోసం పోరాడిన ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారు.

బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన వెంటనే తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే మార్గాల రూపకల్పన, భూసేకరణకు సంబంధించిన పనులపై దృష్టి సారించాలని ఇంజనీర్లకు సూచించారు. ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, కోరిన నివేదికలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

డిండి, అచ్చంపేటకు అదనపు నీరు

డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు నీటిని తరలించే అవకాశాలను పరిశీలించాలని, అవసరమైన పంపులు, పంప్‌హౌస్‌లు, కాల్వలు, సొరంగాల సామర్థ్యంపై అధ్యయనం చేసి డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

డిండి ప్రాజెక్టుకు నార్లాపూర్ నుంచి నీటిని తీసుకురావాలా, ఏదుల నుంచి తరలించాలా అనే అంశంపై మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా సమావేశంలో చర్చించారు. రెండు మార్గాల్లో అయ్యే ఖర్చులు, సాంకేతిక అనుకూలతలు, ప్రతికూలతలను అధికారులు వివరించారు.

పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అదనపు నీటిని సమకూర్చి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సాగునీటి అవసరాలను మహారాష్ట్రతో జరిగే చర్చల్లో సమర్థంగా వివరించి, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సానుకూల పరిష్కారం సాధించే దిశగా కృషి చేయాలని మంత్రులకు సూచించారు.