manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 11:47 am Editor : user5442714

ఆ మార్కెట్‌లో పత్తికి రాష్ట్రంలోనే అత్యధిక ధర..

క్వింటాల్‌కు రూ.9,260 పలికిన పత్తి.. దళారులను ఆశ్రయించకుండా మార్కెట్‌కు రావాలని రైతులకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి సూచన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తెలంగాణ: అక్టోబర్ 23, పత్తి రైతులకు మెరుగైన ధరలు అందించడమే లక్ష్యంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. పత్తి కొనుగోళ్ల రెండో రోజున కూడా ఆదిలాబాద్ మార్కెట్‌లో రాష్ట్రంలోని ఇతర ప్రధాన మార్కెట్లతో పోలిస్తే అత్యధిక ధర నమోదైనట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్ మార్కెట్‌లో ప్రైవేట్ కొనుగోళ్ల ద్వారా పత్తికి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,260 ధర లభించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా నాణ్యమైన పత్తిని నేరుగా వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చి మెరుగైన ధర పొందాలని సూచించారు.

రాష్ట్రంలోని ఇతర ప్రధాన మార్కెట్లలో నమోదైన పత్తి ధరలను పరిశీలిస్తే వరంగల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.9,010, జమ్మికుంట మార్కెట్‌లో రూ.9,170, ఖమ్మం మార్కెట్‌లో రూ.9,100 వరకు ధరలు నమోదైనట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ వివరాలను ఆదిలాబాద్ మార్కెట్ కార్యాలయంలోని నోటీసు బోర్డు ద్వారా అధికారికంగా ప్రదర్శించినట్లు చెప్పారు.

సీసీఐ, ప్రైవేట్ కొనుగోళ్లకు వేర్వేరు ధరలు

ఆదిలాబాద్ మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు ధర రూ.8,667 కాగా, ప్రైవేట్ కొనుగోళ్లలో గరిష్ఠంగా రూ.9,260 ధర నమోదైనట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. పత్తి నాణ్యత, తేమ శాతం తదితర అంశాల ఆధారంగా ధరల్లో వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు.

రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే సమయంలో నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన పత్తికి మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని మార్కెట్ కమిటీ చైర్మన్ సూచించారు. మార్కెట్‌లో కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్‌కు వచ్చే పత్తి ఉత్పత్తుల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విట్టల్, మార్కెట్ సూపర్‌వైజర్ స్వామి, వివిధ శాఖల అధికారులు, కమిషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, మార్కెట్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో పత్తి రైతులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad