manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 2:10 am Editor : user5442714

పైసలు ఇస్తేనే.. ఇందిరమ్మ ఇళ్లు.!

 పైసలు ఇస్తేనే.. ఇందిరమ్మ ఇళ్లు!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆదిలాబాద్‌లో లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలు.. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం

మన భారత్, ఆదిలాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరి అక్రమ వసూళ్ల ఆరోపణలతో చర్చనీయాంశంగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇల్లు మంజూరైందన్న ఆనందం కంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఆందోళన పేద కుటుంబాలను వెంటాడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇళ్లు అందించామంటూ వసూళ్ల పర్వం?

ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో గతంలో నిర్మించిన ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు అందించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఇళ్ల కేటాయింపు, పట్టాల పంపిణీ తదితర ప్రక్రియల పేరుతో కొందరు లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు పొందేందుకు అర్హత కలిగిన పేద కుటుంబాలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు మంజూరు కావడం, పట్టా చేతికి రావడం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎవరెవరు ఎంత మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

కౌన్సిలర్లు, అధికారుల పేర్లతో వసూళ్లా?

స్థానిక కౌన్సిలర్లు ఒకవైపు, సంబంధిత అధికారులు మరోవైపు ఉన్నారంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇల్లు మంజూరు చేయించడం, పట్టాలు ఇప్పించడం, ఇతర ప్రక్రియలు పూర్తి చేయించడం వంటి కారణాలు చూపుతూ డబ్బులు అడుగుతున్నారనే ప్రచారం ఉంది. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో అధికారులు సమగ్రంగా విచారిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు కావాల్సిన సమయంలో ఇలాంటి ఆరోపణలు తెరపైకి రావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. నిజంగా డబ్బులు వసూలు చేసి ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ పూర్తికాకముందే వారిని దోషులుగా నిర్ధారించకూడదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఉన్నతాధికారులు స్పందించాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారమే ప్రయోజనాలు అందాలి. ఇళ్ల కేటాయింపు, పట్టాల పంపిణీ, ఇతర సేవల పేరుతో ఎవరైనా అనధికారికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే అంశంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా ప్రత్యేకంగా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అలాగే లబ్ధిదారుల జాబితాలు, ఇళ్ల కేటాయింపు వివరాలు, పట్టాల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. డబ్బులు చెల్లించకపోతే ఇల్లు లేదా పట్టా రాదనే భయాన్ని ఎవరైనా కల్పిస్తే, అటువంటి చర్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పేదల ఆశలకు భరోసా కల్పించాలి

ఇందిరమ్మ ఇల్లు అనేది పేద కుటుంబానికి కేవలం నిర్మాణం మాత్రమే కాదు.. జీవితకాల స్వప్నం. అలాంటి పథకం పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు నిజమైతే అది పేదల ఆశలను దెబ్బతీసినట్లే. అందువల్ల జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరికొందరు అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ కి పిర్యాదు చేస్తామని స్థానికులతో చర్చిస్తున్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad