manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 1:09 am Editor : user5442714

ఘనంగా బతుకమ్మల నిమజ్జనం..

బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళల సందడి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 22,
తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మహిళలు సంప్రదాయబద్ధంగా అలంకరించి, బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, చిన్నారులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై పండుగ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

వాగు వద్దకు చేరుకున్న అనంతరం సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలకు పూజలు నిర్వహించి, అనంతరం వాటిని వాగులో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా డప్పు వాయిద్యాల సందడి, మహిళల బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులు ప్రతి ఏటా సామూహికంగా నిర్వహిస్తూ వస్తున్నారని స్థానికులు తెలిపారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడంతో నిమజ్జన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో సుంకిడి గ్రామ సర్పంచ్ మగ్గిడీ నర్సమ్మ ప్రకాష్, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad