(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మావల పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ట నిఘా.. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని సూచన
మన భారత్, మావల: అక్టోబర్ 22,
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను ఆయన సమీక్షించారు.
మావల పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. పోలీస్ సిబ్బంది నిర్వహించిన డ్రిల్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బందికి అందజేసిన కిట్ ఆర్టికల్స్‌ను కూడా పరిశీలించారు.
స్టేషన్ రికార్డుల పరిశీలన
పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, సాంకేతిక విభాగం, ఉమెన్ హెల్ప్ డెస్క్, సిబ్బంది వేచి ఉండే గది, స్టోర్ రూమ్, రికార్డు రూమ్, కోర్టు డ్యూటీ అధికారి విధులను ఎస్పీ పరిశీలించారు. స్టేషన్ ఆవరణ, పరిసరాలు, పోలీసు వాహనాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌ను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్న ఎస్పీ.. కేసుల ప్రస్తుత దర్యాప్తు స్థితిగతులపై ఆరా తీశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులకు శిక్షలు పడే విధంగా ఆధారాల సేకరణ, దర్యాప్తు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.
సైబర్ నేరాలు, సీఈఐఆర్‌పై సమీక్ష
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసులు, బాధితుల వివరాలు, సీఈఐఆర్ ద్వారా తిరిగి అందించిన మొబైల్ ఫోన్ల వివరాలను ఎస్పీ పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్ విధానం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వినియోగించే కిట్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
డయల్-100, పెట్రో కార్, బ్లూ కోర్ట్, రౌడీ షీటర్లపై నిఘా, స్టేషన్ పరిధిలో చేపడుతున్న తనిఖీలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్థిక నేరాల నియంత్రణకు చర్యలు
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ గస్తీని పెంచాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా ఆర్థిక నేరాల నియంత్రణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. దొంగతనాల నివారణ కోసం రాత్రి వేళల్లో బీట్లు నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు సమాచార సేకరణను బలోపేతం చేయాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని కేటాయించి నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేపట్టడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసి స్థానికంగా అందే సమాచారాన్ని నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని తెలిపారు.
విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ అవసరం
పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించడం ద్వారా నేరాలను ముందుగానే అరికట్టడంతో పాటు ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
వర్టికల్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి విభాగంలోనూ మెరుగైన పనితీరు కనబరిచేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ తనిఖీలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్ రెడ్డి, కె. రవీందర్, అబ్దుల్ మునీర్ అహ్మద్, బి. సాయి, హీరాలాల్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
