పత్తి పొలంలో అంతర పంటగా గంజాయి సాగు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రూ.4 లక్షల విలువైన 40 గంజాయి మొక్కలు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
మన భారత్, బోథ్: అక్టోబర్ 22:
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని బోథ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బోథ్ మండలం నిగిని గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి పంట మధ్యలో సాగు చేస్తున్న 40 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిగిని గ్రామానికి చెందిన లక్ష్మన్ మదావి (51)కు గంజాయి వినియోగించే అలవాటు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. గతంలో గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన అనంతరం మిగిలిన గంజాయి నుంచి విత్తనాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. వాటిని తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్యలో ఎవరికీ తెలియకుండా నాటినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ సాగు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో మొత్తం 40 గంజాయి మొక్కలు లభించగా, ఒక్కో మొక్క విలువ సుమారు రూ.10 వేల చొప్పున మొత్తం విలువ రూ.4 లక్షలుగా అంచనా వేశారు.
కేసు నమోదు.. నిందితుడి అరెస్ట్
గంజాయి సాగుకు సంబంధించి బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి లక్ష్మన్ మదావిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సాగు, నిల్వ, విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపారు.
గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకుండా సంబంధిత శాఖలకు సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఐ పేర్కొన్నారు. అక్రమంగా మాదకద్రవ్యాల సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు.
ఈ తనిఖీలు, అరెస్ట్ చర్యల్లో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తంతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
