manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:41 am Editor : user5442714

ఆయుధ భాండాగారంలో ప్రత్యేక పూజలు..

విజయదశమి సందర్భంగా ఆయుధ భాండాగారంలో ప్రత్యేక పూజలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధ భాండాగార మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ చేపట్టారు.

విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పండుగను పురస్కరించుకుని ఆయుధ భాండాగారంలోని ఆయుధాలకు, సాయుధ పోలీస్ విభాగానికి చెందిన వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసు వాహనాల విభాగం సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు.

ఇటీవల నిర్వహించిన దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర కూడా జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తగిన భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు. ప్రజల సహకారంతో పండుగ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు.

పోలీస్ శాఖలో ఆయుధాలు కీలకమైనవని, సాయుధ బలగాల ఆధ్వర్యంలో వాటిని భద్రంగా సంరక్షిస్తామని ఎస్పీ వివరించారు. విజయదశమి పర్వదినం జిల్లా ప్రజలందరికీ విజయాన్ని, సంతోషాన్ని అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎన్. చంద్రశేఖర్, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ టీం సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad