manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 6:25 pm Editor : user5442714

రిపోర్టర్ పేరుతో రూ.20 వేల డిమాండ్.!

ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుల చర్యలు.. బెదిరింపుల కేసులో ఒకరు, హోటల్ చోరీ కేసులో మరొకరు అరెస్ట్

రిపోర్టర్ పేరుతో రూ.20 వేల డిమాండ్.. బిర్యానీ హోటల్‌లో తాళాలు పగలగొట్టి నగదు చోరీ

నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు: వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18:

ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రిపోర్టర్ పేరుతో పరిచయం చేసుకుంటూ డబ్బులు డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడిన కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని, మరోవైపు బిర్యానీ హోటల్‌లో తాళాలు పగలగొట్టి నగదు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ వెల్లడించారు.

రిపోర్టర్ పేరుతో రూ.20 వేలు డిమాండ్

రిపోర్టర్ పేరుతో ఒక వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఘటనలో దీపాయిగూడ గ్రామానికి చెందిన రాకేశ్, ఏనుగంటి రమాకాంత్, కుషన్‌పల్లి స్వామి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. జల్సాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురూ కలిసి ఈ పథకం రూపొందించారు.

ఈ క్రమంలో అక్టోబర్ 7న కుషన్‌పల్లి స్వామి ఫోన్ నుంచి దుర్గం శేఖర్‌కు ఫోన్ చేసి, తాను రిపోర్టర్‌నని పరిచయం చేసుకుంటూ రూ.20,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అతనికి సంబంధించిన వివరాలను బయటపెట్టి చెడుగా ప్రచారం చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం దుర్గం శేఖర్ సంబంధిత వ్యక్తిని కాన్ఫరెన్స్ కాల్‌లోకి తీసుకురావడంతో నిందితుల వ్యవహారం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే కుషన్‌పల్లి స్వామి, ఏనుగంటి రమాకాంత్‌లను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రాకేశ్‌ను ఆదిలాబాద్ పట్టణంలో గుర్తించి అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన లావా కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బిర్యానీ హోటల్‌లో తాళాలు పగలగొట్టి చోరీ

ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్ చౌక్ వద్ద ఉన్న ఆదిలాబాద్ బిర్యానీ హోటల్‌లో చోరీ జరిగిన ఘటనపై కూడా వన్‌టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 17వ తేదీ తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో షైక్ తబ్రిజ్ అనే వ్యక్తి హోటల్ వెనుకవైపు ఉన్న తలుపు వద్దకు వెళ్లాడు. అక్కడి తాళాన్ని రాయితో పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు.

అనంతరం కౌంటర్‌తో పాటు చిన్న గల్లాపెట్టె తాళాలను కూడా పగలగొట్టి అందులోని నగదును తీసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని తన అవసరాలకు, జల్సాలకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

మిగిలిన నగదుతో మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో అక్టోబర్ 18న నేతాజీ చౌక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వన్‌టౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హోటల్‌లో చోరీ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద మిగిలి ఉన్న రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నారు.

నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ఈ రెండు ఘటనలపై స్పందించిన వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం, దొంగతనాలకు పాల్పడడం వంటి నేరాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడే వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు అపరిచిత వ్యక్తుల బెదిరింపులకు భయపడి డబ్బులు చెల్లించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad