manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:47 am Editor : user5442714

అక్టోబర్ 22 నుంచి పత్తి కొనుగోళ్లు షురూ..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 22 నుంచి పత్తి కొనుగోళ్లు

రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అక్టోబర్ 22, 2026 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సీసీఐ (CCI), ప్రైవేట్ కొనుగోలు సంస్థల ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

పత్తి కొనుగోళ్లలో తేమ శాతం నిర్ధారణ, నాణ్యత ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శుక్రవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

రైతులకు మార్కెట్ యార్డులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు రైతులు తేమ శాతంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పత్తి నాణ్యత ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటే మద్దతు ధర పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కొనుగోళ్ల ప్రక్రియలో తేమ శాతం నిర్ధారణ కీలకమైన అంశమని, ఈ విషయంలో సిబ్బంది రైతులకు సరైన సమాచారం అందించాలని సూచించారు. మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకొచ్చే రైతులు నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం, కొనుగోలు విధానంపై ముందుగానే అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు.

రైతులకు పారదర్శకంగా, సజావుగా పత్తి కొనుగోళ్లు జరిగేలా మార్కెట్ కమిటీ, సీసీఐ, ఐకేపీ, వీఓఏ సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో డీఎంవో గజానంద్, సెలెక్షన్ గ్రేడ్ అధికారి విట్టల్, రైతు నాయకులు గోవర్ధన్ యాదవ్, కొలారి పోశెట్టి, లక్ష్మణ్, దత్తార్ధి, రమేష్, సీసీఐ బ్రాంచ్ మేనేజర్, ఐకేపీ వీఓఏలు, సీసీఐ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ పూజ, సెక్షన్ ఏ నరేష్, సెక్షన్ బీ గణేష్, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad