manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:55 am Editor : user5442714

ఆ చిన్నారులకు మాజీ ఎమ్మెల్యే భరోసా.!

రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికకు బాపూరావు ఆర్థిక సాయం

అక్కాచెల్లెళ్లను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే

వైద్యులతో మాట్లాడి నాగమణి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 17,
తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అండగా నిలిచారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్రం నాగమణిని ఆయన పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు. నాగమణి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

నేరడిగొండ మండలం గుప్తాల గ్రామపంచాయతీ పరిధిలోని ఏషూ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జల్దేవి (18), నాగమణి (15) అక్కాచెల్లెళ్లు. రెండేళ్ల క్రితం కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా, ఆరు నెలల వ్యవధిలో తల్లి కూడా మృతి చెందినట్లు బాపూరావు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనంతరం అక్కాచెల్లెళ్లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం నాగమణి అనారోగ్యానికి గురై రిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో వైద్య ఖర్చులు భరించడం కుటుంబానికి భారంగా మారిందని తెలిపారు. చెల్లి పరిస్థితిపై ఆందోళనకు గురైన అక్క జల్దేవిని బాపూరావు ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అవసరమైన సమయంలో తనవంతు సహకారం అందిస్తానని, ఇంటికి కూడా వచ్చి పరిస్థితిని తెలుసుకుంటానని భరోసా ఇచ్చారు.

వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరణ

రిమ్స్ వైద్యులతో బాపూరావు మాట్లాడి నాగమణికి అందుతున్న చికిత్స, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం నవజాత శిశువుల విభాగాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్థిక పరిస్థితుల కారణంగా పేదలు వైద్య సేవలకు దూరం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని బాపూరావు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు తమవంతు సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందడంతో పాటు, ఆర్థిక స్థోమత లేని వారికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని బాపూరావు అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని, వైద్య ఖర్చులు భరించలేక నిరుపేదలు ఇబ్బందులు పడకూడదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని అవసరమైన సహకారం అందించేందుకు తెలంగాణ రక్షణ సేన తరఫున కృషి చేస్తామని తెలిపారు.

నాగమణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అక్కాచెల్లెళ్లు ధైర్యంగా ఉండాలని బాపూరావు సూచించారు.

ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్ రావు, సీనియర్ నాయకుడు రఘునాథ్, గుడిహత్నూర్ మండల కన్వీనర్ పిట్ల మహేందర్‌తో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad