ముళ్ల పొదలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పొదలు తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి
మన భారత్, తలమడుగు: అక్టోబర్ 16, తలమడుగు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో పెరిగిన పొదల కారణంగా విద్యుత్ తీగలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా గాలి వీచిన సమయంలో ముళ్ల కొమ్మలు తీగలకు తాకడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న ముళ్ల పొదలను తొలగించి, విద్యుత్ తీగలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కోరుతున్నారు.
ఈ విషయమై స్థానిక సర్పంచ్ ఎలుగు రాజన్నను సంప్రదించగా, సమస్యను వీలైనంత త్వరగా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న ముళ్ల పొదలను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ హామీతోనైనా సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
