manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 6:51 am Editor : user5442714

ఆ నగర్‌లో పాత కక్షలతో వ్యక్తిగత ఘర్షణ..

భగత్ సింగ్ నగర్‌లో పాత కక్షలతో వ్యక్తిగత ఘర్షణ

కేసు నమోదు.. నిందితులు పోలీసుల అదుపులో

ఘటనను మతపరమైన కోణంలో ప్రచారం చేయొద్దన్న ఆదిలాబాద్ డీఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 16,

ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌లో పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, గొడవకు కారణమైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.

డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. భగత్ సింగ్ నగర్‌లో స్వామి మాల ధరించిన వ్యక్తి మరో వ్యక్తితో దురుసుగా మాట్లాడటంతో వివాదం ప్రారంభమైందని తెలిపారు. అనంతరం పరిస్థితి ఘర్షణకు దారితీసిందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయని చెప్పారు.

ఘటనలో మొదట స్వామి మాల ధరించిన వ్యక్తే దాడికి పాల్పడినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. అనంతరం జరిగిన దాడిలో ఇద్దరు హిందూ, ఒక ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. స్వామి మాల ధరించిన వ్యక్తిపై జరిగిన దాడిలో ఇరు మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ, ఈ ఘటనకు మతపరమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది పాత కక్షల నేపథ్యంలో కాలనీ వాసుల మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత ఘర్షణగా పోలీసులు గుర్తించారని తెలిపారు.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఘటనకు సంబంధించి స్వామి మాల ధరించిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో హిందువులు, ముస్లింలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గొడవకు కారణమైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారని వెల్లడించారు. కేసు దర్యాప్తులో సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై హెచ్చరిక

ఈ ఘటనను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా, వాట్సాప్ తదితర మాధ్యమాల్లో వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఒక వర్గానికి మద్దతుగా లేదా మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు చేయవద్దని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని వాస్తవమని నమ్మకుండా, సంబంధిత అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, మతసామరస్యానికి భంగం కలిగించే ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరారు.

30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినా, మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారాలు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, భగత్ సింగ్ నగర్ ఘటనను మతపరమైన అంశంగా చిత్రీకరించకుండా వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంయమనం పాటించి ఆదిలాబాద్ జిల్లాలో మతసామరస్యాన్ని కాపాడేందుకు సహకరించాలని కోరారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad