ఇంద్రవెల్లిలో ఈ నెల 30న పాంచజన్య సంకల్ప సభ
సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాథోడ్ బాపురావు పిలుపు
మన భారత్, ఇంద్రవెల్లి: అక్టోబర్ 15, ఇంద్రవెల్లి గడ్డపై ఈ నెల 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గురువారం రాథోడ్ బాపురావు, టీఆర్ఎస్ పార్టీ వివిధ జిల్లాల ఇన్చార్జిలతో కలిసి ఇంద్రవెల్లిలోని నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ ఏర్పాట్లు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో సమన్వయం చేసుకోవాలని రాథోడ్ బాపురావు సూచించారు. సభకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని రాథోడ్ బాపురావు వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవిత ఎన్నిక కావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయడం కోసం పార్టీ కుటుంబ సభ్యులు ఐక్యంగా పనిచేయాలని, సభకు భారీగా హాజరై తమ మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, వివిధ జిల్లాల ఇన్చార్జిలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల స్థాయి నాయకులు తమ పరిధిలో సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ మాజీ మంత్రి బోడా జనార్దన్, సభ పర్యవేక్షకురాలు లలిత, విక్రాంత్ రెడ్డి, ఖానాపూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ మెస్రం దయాకర్, పార్లమెంట్ ఇన్చార్జ్ మాడవి బాపురావు, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ వేణుగోపాల్ యాదవ్తో పాటు జిల్లా నాయకులు, వివిధ జిల్లాల ఇన్చార్జిలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
