మన భారత్,జయ శంకర్ భూపాలపల్లి:
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటరు జాబితాలో అర్హులైన పౌరులెవరూ మిగిలిపోకుండా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు, గతంలో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోని వారు, తొలిసారిగా ఓటు హక్కు పొందనున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతతో పాటు ఓటరు జాబితాలో పేరు లేని వారు సంబంధిత పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఫారం-6 ద్వారా తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ప్రత్యేక క్యాంపుల నిర్వహణ సమయంలో సంబంధిత బూత్ స్థాయి అధికారులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు, సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో ఫారం-6 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం నవంబర్ 9, 2026న ప్రచురించనున్న తుది ఓటరు జాబితాలో చేర్చనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం బాధ్యతగా భావించాలని తెలిపారు. కాబట్టి జిల్లాలోని అర్హులైన పౌరులందరూ అక్టోబర్ 15, 16 తేదీల్లో తమకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
Cell Number : cell_number : 9603952108
User Name : user_name : రాజు శీలపాక
