manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:19 pm Editor : Editor Vishal Kumar

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి మోసం.. రూ.30 వేల వసూలు

డ్రగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదు

మన భారత్, అక్టోబర్ 12, తలమడుగు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగిని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో డ్రగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి రూ.30 వేల నగదు వసూలు చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన తొకాల శివకిరణ్ తన తండ్రికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో హెర్నియా ఆపరేషన్ చేయించే సమయంలో తలమడుగు మండలం భరంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్‌తో పరిచయం ఏర్పడింది. తాను కలెక్టరేట్‌లో పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే పరిచయాలు ఉన్నాయని రఫీక్ నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

శివకిరణ్ బీకామ్ చదివినట్లు తెలుసుకున్న రఫీక్.. వైద్య ఆరోగ్య శాఖలో డ్రగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు ప్రాసెసింగ్ ఖర్చులు, ఉన్నతాధికారులకు చెల్లింపుల పేరుతో మొత్తం రూ.80 వేల వరకు అవసరమవుతాయని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో 2026 ఆగస్టు 24న శివకిరణ్ భరంపూర్ గ్రామానికి వెళ్లి రఫీక్‌కు రూ.27 వేల నగదును అందజేశాడు. మరో రూ.3 వేల మొత్తాన్ని రఫీక్ సూచన మేరకు ప్రశాంత్ అనే వ్యక్తికి ఫోన్‌పే ద్వారా పంపించాడు. ఇలా మొత్తం రూ.30 వేలు చెల్లించినప్పటికీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించలేదని బాధితుడు ఫిర్యాదు చేశాడు. చివరకు తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

సెప్టెంబర్ 30న ఫిర్యాదు.. కేసు నమోదు

బాధితుడు 2026 సెప్టెంబర్ 30న తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిగా పేర్కొన్న మహమ్మద్ రఫీక్ (42), తండ్రి మహమ్మద్ హనీఫ్, భరంపూర్ గ్రామం, తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 205/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 316(5) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తలమడుగు ఎస్ఐ డి. రాధిక తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో డబ్బులు చెల్లించవద్దు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఉద్యోగ నియామకాలు అధికారిక నోటిఫికేషన్లు, నిర్ణీత ఎంపిక ప్రక్రియ ద్వారానే జరుగుతాయని, ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారూ.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.