manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:32 pm Editor : Editor Vishal Kumar

మౌలిక సదుపాయాలకు చర్యలు..

రిమ్స్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి

రూ.50 కోట్లతో ఎంసీహెచ్ భవనం.. రూ.11.10 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు

మరో రూ.98 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు – ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, అక్టోబర్ 12, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన, ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులు, ప్రతిపాదనల స్థితిగతులు, పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రోగుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాల కల్పన

హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల తర్వాత పెద్ద సంఖ్యలో రోగులు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు రిమ్స్ ప్రధాన వైద్య కేంద్రంగా ఉందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, అవసరమైన వసతులను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రూ.61.10 కోట్లతో అభివృద్ధి పనులు

రిమ్స్ ఆసుపత్రిలో రూ.50 కోట్ల వ్యయంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) భవన నిర్మాణానికి, సుమారు రూ.11.10 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్లు, ప్లంబింగ్ తదితర మౌలిక సదుపాయాల పనులకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు

రిమ్స్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి మున్సిపల్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ), వైద్య ఆరోగ్య శాఖల ఇంజినీరింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రజాధనంతో చేపట్టే పనులు నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందించే సేవలు రోగులకు ఎంతో కీలకమని పాయల్ శంకర్ పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు వైద్యులపై ఎంతో నమ్మకంతో ఉంటారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి రోగి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. రోగుల సమస్యలను ఓపికగా విని, వారికి అందుబాటులో ఉన్న వైద్య సేవలను సకాలంలో అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వైద్యుల నియామకాల సమస్య పరిష్కారానికి కృషి

రిమ్స్‌లో వైద్యుల నియామకాల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వైద్యులు పనిచేసేలా ప్రోత్సాహకాలు కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. వైద్యుల కొరత తగ్గితే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మరో రూ.98 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు

రిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.98 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు పాయల్ శంకర్ తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు.

అదనపు నిధులు అందుబాటులోకి వస్తే రిమ్స్‌లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడంతో పాటు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్‌ను జిల్లా ప్రజలతో పాటు గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించే సమర్థవంతమైన వైద్య కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారూ

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.