భీంపూర్లో అప్పుల బాధతో మరో రైతు మృతి
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
మన భారత్, భీంపూర్: అక్టోబర్ 7,ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తలమడుగులో ఇటీవల ఓ రైతు మృతి చెందిన ఘటన మరువకముందే భీంపూర్ మండలంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో పిప్పల్కోటి గ్రామానికి చెందిన రైతు పసుల ఆశన్న (50) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పిప్పల్కోటి గ్రామానికి చెందిన ఆశన్న వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా అప్పుల భారం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆశన్న పురుగుల మందు తాగిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రైతు మృతితో పిప్పల్కోటి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వరుసగా రైతులు ప్రాణాలు కోల్పోతుండటంతో రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, అప్పుల సమస్యలపై చర్చ జరుగుతోంది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, మృతికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు, పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. రైతు కుటుంబానికి ప్రభుత్వం తగిన సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
