RTC ఎన్నికల్లో JAC అభ్యర్థులను గెలిపించాలి: AITUC ఉపాధ్యక్షులు ఎస్. విలాస్
ఆదిలాబాద్ ,మన భారత్ :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ (RTC) ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (EU), టీఎంయూ (TMU), ఎన్ఎంయూ (NMU)లతో కూడిన జేఏసీ (JAC) నాయకులను కార్మికులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎస్. విలాస్ పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని భూక్తాపూర్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ భారతల గోవర్ధన్ అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్. విలాస్ రాష్ట్ర రిపోర్టును ప్రవేశపెట్టి, కార్మికులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్. విలాస్ మాట్లాడుతూ… 2016లోనే దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు “సమాన పనికి సమాన వేతనం” వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను బుట్టదాఖలు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, హక్కుల సాధనకు కార్మికులందరూ ఐక్యంగా మిలిటెంట్ పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఆమోదించిన ముఖ్యమైన తీర్మానాలు:
ఆర్టీసీ ఎన్నికల్లో జేఏసీ నాయకుల విజయం కోసం నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొనాలి.
అక్టోబర్ 31న ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా జెండాలు, తోరణాలతో పండుగలా నిర్వహించాలి.
నవంబర్ 21 నుంచి 26 వరకు బెంగళూరులో జరిగే ఏఐటీయూసీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేసేవరకు పోరాటాలు సాగించాలి.
ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, జిల్లా నాయకులు జి. రాజు, ఎ. చంద్రకళ, ఎమ్. కాంతారావు, ఎస్.కె. ఉస్మాన్, కె. గంగయ్య, వై. ఆశన్న, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ పురుషోత్తం మన భారత్ రిపోర్టర్ నేరడిగొండ
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
