manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:35 pm Editor : Editor Vishal Kumar

బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం..

భీంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ

బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి.. గంజాయి, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి

మన భారత్, భీంపూర్: అక్టోబర్ 6, భీంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించడంతో పాటు వాహనాల నిర్వహణ, కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా పోలీసులకు వివరించేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి చట్టపరంగా సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా పోలీసులపై మరింత విశ్వాసం పెంచాలని తెలిపారు.

రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించాలి

పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, కేసుల విషయంలో ఎలాంటి అనవసర పెండెన్సీ లేకుండా చూడాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణకు బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేస్తూ సిబ్బంది గ్రామాల్లో నిరంతరం పర్యటించాలని ఆదేశించారు. గ్రామాల్లో నెలకొనే సమస్యలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని తెలిపారు.

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మోసపూరిత సందేశాలకు స్పందించకుండా ప్రజలకు సూచించాలని అన్నారు.

అదేవిధంగా రోడ్డు భద్రతపై కూడా విస్తృత ప్రచారం నిర్వహించి, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చైతన్యపరచాలని సూచించారు.

మహిళలు, చిన్నారులకు భరోసా కల్పించాలి

మహిళలు, చిన్నారులపై వేధింపులు లేదా ఇతర నేరాలు జరిగినప్పుడు బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించేలా ప్రజల్లో భరోసా కల్పించాలని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

భీంపూర్ మండలం సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. సంఘ వ్యతిరేక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్పీ వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు

మండలంలో అసాంఘిక లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే నిర్భయంగా జిల్లా ఎస్పీ వాట్సాప్ నంబర్ 8712659973 కు సమాచారం అందించవచ్చని తెలిపారు. ఈ వాట్సాప్ నంబర్‌ను జిల్లా ఎస్పీ స్వయంగా నిర్వహిస్తున్నారని, సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, భీంపూర్ ఎస్సై పీర్ సింగ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.