గ్రామ పాలనకే పరిమితం కాకుండా చెత్త ట్రాక్టర్ నడిపిన సర్పంచ్
పారిశుధ్యం కోసం బాధ్యతను భుజాన వేసుకున్న అగ్రహారం సర్పంచ్ మామిండ్ల కిషన్
ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 06 మన భారత్ ప్రతినిధి : సర్పంచ్ అంటే గ్రామ పాలన చూసే ప్రజాప్రతినిధి మాత్రమే కాదు.. అవసరమైతే ప్రజల ఆరోగ్యం కోసం స్వయంగా రంగంలోకి దిగే నాయకుడని అగ్రహారం సర్పంచ్ మామిండ్ల కిషన్ నిరూపించారు. చెత్త సేకరణ వాహనం నడిపే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఆయన స్వయంగా చెత్త ట్రాక్టర్ స్టీరింగ్ పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో చెత్త సేకరణ వాహనం డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో చెత్త సేకరణకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో సర్పంచ్ మామిండ్ల కిషన్ వెంటనే స్పందించారు.సర్పంచ్గా గ్రామ పాలన చేయడమే కాదు.. అవసరమైతే చెత్త ట్రాక్టర్ డ్రైవర్ అవతారం కూడా ఎత్తారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి చెత్తను సేకరించారు. దీంతో గ్రామ పారిశుధ్య కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి.ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటమే తన బాధ్యత అన్నట్లుగా సర్పంచ్ స్వయంగా చెత్త ట్రాక్టర్ నడిపి చెత్తను తరలించడంపై గ్రామస్థులు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకు రావాలని, అగ్రహారం సర్పంచ్ చర్య అందుకు నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.
“పదవి కోసం కాదు.. ప్రజల కోసం” అన్నట్టుగా సర్పంచ్ కిషన్ చూపిన చొరవ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం విషయంలో చిన్న సమస్య వచ్చినా స్వయంగా రంగంలోకి దిగడం అభినందనీయమని గ్రామస్థులు తెలిపారు.
మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
