manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 5:51 am Editor : Editor Vishal Kumar

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు: ఎస్పీ

రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు

అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
మన భారత్, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్‌తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మార్కెట్ యార్డులో పర్యటించారు. రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు, పత్తి కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, భద్రతా చర్యలపై మార్కెట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం మార్కెట్ యార్డు పరిసరాల్లో రోడ్డు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పత్తి రైతులు, పత్తి లోడ్‌తో వచ్చే వాహనాలు రాంపూర్ రోడ్డు మీదుగా మార్కెట్ యార్డుకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. దీంతో రాంపూర్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. రైతులు, వాహనదారులకు మార్గనిర్దేశం చేసేలా అవసరమైన చోట్ల ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

పత్తి విక్రయాల కోసం దూర ప్రాంతాల నుంచి రైతులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు. మార్కెట్ యార్డు పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. మార్కెట్ యార్డుకు పూర్తిస్థాయి కాంపౌండ్ వాల్ లేని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

పత్తి కొనుగోళ్ల సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రైతులు, మార్కెట్ సిబ్బందిని ఎస్పీ కోరారు. రైతులు తమ పత్తిని విక్రయించుకునే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మార్కెట్ యార్డులో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వాహనాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎంఓ గజానంద్, సెలెక్షన్ గ్రేడ్ ఆఫీసర్ విఠల్, ఏఎంసీ డైరెక్టర్లు శేఖర్ రెడ్డి, మద్దెల పోశెట్టి, మార్కెట్ సిబ్బంది, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గొంటిముక్కుల ప్రసాద్
మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.