manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 11:42 pm Editor : Editor Vishal Kumar

అడవి జంతువుల వేట.. నిందితుడి అరెస్ట్

అడవి జంతువులను వేటాడి మాంసం, కొమ్ముల విక్రయం.. నిందితుడి అరెస్ట్

 

ఘాటంజి అటవీ ప్రాంతంలో జింకల వేట.. వేటకు ఉపయోగించిన బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 5:
అక్రమంగా వన్యప్రాణులను వేటాడుతూ వాటి మాంసం, కొమ్ములు, ఇతర భాగాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది ఆగస్టు 5న కేసు నమోదు కాగా, అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు ప్రస్తుతం పోలీసులకు చిక్కినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణంలోని పంజేశా ప్రాంతానికి చెందిన షోయబ్ అఫ్జల్ (34) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. తన సంపాదనతో విలాసాలకు సరిపడటం లేదని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా వన్యప్రాణులను వేటాడినట్లు విచారణలో వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ఇంట్లో తుపాకీ, వేట సామగ్రి గుర్తింపు

2025 ఆగస్టు 5న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో డబుల్ బ్యారల్ తుపాకీ, కత్తులు, ఉలి తదితర వస్తువులు గుర్తించినట్లు తెలిపారు. అవి తన తాతలు గతంలో వేట కోసం ఉపయోగించినవని నిందితుడు పోలీసులకు తెలిపినట్లు పేర్కొన్నారు.

అనంతరం తుపాకీతో వేటాడి అడవి జంతువుల మాంసం, కొమ్ములు, ఇతర భాగాలను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలోని ఘాటంజి అటవీ ప్రాంతంలో జింకల వేట

నిందితుడు మహారాష్ట్రలోని ఘాటంజి అటవీ ప్రాంతానికి వెళ్లి జింకలను వేటాడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వేటాడిన జింకలను అక్కడే కత్తులతో కోసి మాంసాన్ని విక్రయించినట్లు పేర్కొన్నారు.

జింకల కొమ్ములను హైదరాబాద్‌లో విక్రయిస్తే అధిక మొత్తంలో డబ్బు వస్తుందని భావించి వాటిని ఇంట్లో దాచిపెట్టినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతడి ఇంట్లో జింకల కపాలాలతో కూడిన కొమ్ములు ఆరు, ఒక జత జింక కొమ్ములు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

వేటకు వెళ్లే సమయంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కూడా తనతో వచ్చేవారని, వారంతా కలిసి వేటకు పాల్పడేవారని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

గతంలో భారీగా వేట సామగ్రి స్వాధీనం

నిందితుడి ఇంట్లో గతంలో నిర్వహించిన సోదాల్లో డబుల్ బ్యారల్ తుపాకీ, కత్తులు, జింక కొమ్ములు, జింక తలలతో కూడిన కపాలాలు, టార్చ్‌లైట్, నల్లరంగు జాకెట్, మఫ్లర్, షూస్, బ్యాగ్, మూడు పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదైన విషయం, పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నిందితుడు హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఆర్ణి, పూణే ప్రాంతాల్లో తిరుగుతూ పోలీసులకు చిక్కకుండా ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఆదిలాబాద్‌కు తిరిగి వచ్చి ఇంటి వద్ద ఉన్న సమయంలో వన్‌టౌన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వేటకు ఉపయోగించిన బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం

ప్రస్తుతం నిందితుడి వద్ద నుంచి పోలీసులు వేటకు ఉపయోగించిన Suzuki Burgman Street మోటార్ సైకిల్ (TS-12-ET-4397)*తో పాటు Samsung Duos సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

వన్యప్రాణులను వేటాడటం, వాటి శరీర భాగాలను అక్రమంగా కలిగి ఉండటం, విక్రయించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు విఘాతం కలిగించేలా అక్రమ వేటకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుల బృందాన్ని అధికారులు అభినందించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.