మీసేవలో ధరల పట్టిక ప్రకారమే చార్జీలు
రశీదు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి
అదనపు వసూళ్లకు పాల్పడితే నిర్వాహకులపై చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 04 (మన భారత్ ప్రతినిధి ): మీసేవ కేంద్రాల్లో ప్రజలు ధరల పట్టిక ప్రకారం మాత్రమే బిల్లులు చెల్లించి, తప్పనిసరిగా రశీదు పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మీసేవ సెంటర్ల ఈడీఎం శ్రీనివాస్ సూచించారు. నిర్ణయించిన ధరల కంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయాలని, విచారణ అనంతరం సంబంధిత మీసేవ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విశ్వం మీసేవ కేంద్రాన్ని ఆదివారం ఈడీఎం శ్రీనివాస్, డీఎం మహేష్ కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఇటీవల విశ్వం మీసేవ కేంద్రంలో జరిగిన ఘటనపై సంబంధిత ఆపరేటర్‌ను తొలగించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం కొత్త ఆపరేటర్‌ను నియమించి, ఆపరేటర్‌తో పాటు యజమాని మల్లేశంకు లాగిన్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
అనంతరం విలేకరులతో ఈడీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 92 మీసేవ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అన్ని కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టిక ప్రకారమే సేవలకు చార్జీలు వసూలు చేయాలని సూచించారు. అదనంగా డబ్బులు వసూలు చేస్తే ప్రజలు భయపడకుండా ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల అవసరాలను బట్టి మీసేవ కేంద్రాల్లో ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తున్నామని, స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ ఇంటర్వ్యూల ద్వారా నిర్వాహకులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా చిన్నపిల్లల ఆధార్ కార్డుల విషయంలో మీసేవ నిర్వాహకులకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఈడీఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలు మీసేవ కేంద్రాల్లో సేవలు పొందే సమయంలో ధరల పట్టికను పరిశీలించి, చెల్లించిన ప్రతి మొత్తానికి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
మీ ఓగ్గు మహేష్ చంద్ర , మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, రాజన్న సిరిసిల్ల.
జిల్లా ఆర్సీ ఇన్చార్జి తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
