manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 2:30 am Editor : Editor Vishal Kumar

సాకినాపూర్–భరంపూర్ రహదారికి మోక్షమెప్పుడో.?

15 ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు..

8 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి

 బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ మెస్రం నికిత నాగేష్, గ్రామస్థుల డిమాండ్

 

 మన భారత్, అక్టోబర్ 3, తలమడుగు: తలమడుగు మండలం సాకినాపూర్ గ్రామం నుంచి భరంపూర్ వరకు ఉన్న రహదారిని నిర్మించాలని సాకినాపూర్ గ్రామ సర్పంచ్ మెస్రం నికిత నాగేష్ ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. సాకినాపూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్లే ప్రజలకు భరంపూర్ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఏళ్లుగా రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.

 

 గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్నా సాకినాపూర్–భరంపూర్ రహదారి అభివృద్ధికి నోచుకోవడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం పూర్తయితే సాకినాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

 

 8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి

 ప్రస్తుతం సాకినాపూర్ నుంచి భరంపూర్ వైపు నేరుగా రాకపోకలు సాగించేందుకు సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ఈ మార్గం అభివృద్ధి చేస్తే ప్రయాణ దూరం తగ్గడంతో పాటు సమయం, ఇంధన వ్యయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు.

 ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్లాల్సి రావడంతో సుమారు 8 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర ప్రయాణికులు రహదారి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

  భరంపూర్ ఏడుకొండల స్వామి ఆలయానికి భక్తుల రాక

 భరంపూర్ గుట్టపై వెలసిన ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం వివిధ ప్రాంతాలు, మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని సర్పంచ్ మెస్రం నికిత నాగేష్ తెలిపారు. రహదారి సౌకర్యం మెరుగుపడితే భక్తుల రాకపోకలకు కూడా మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

 ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

 అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

సాకినాపూర్–భరంపూర్ మధ్య రహదారి నిర్మాణానికి సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 ఇకనైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సాకినాపూర్ నుంచి భరంపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సర్పంచ్ మెస్రం నికిత నాగేష్‌తో పాటు గ్రామస్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.