అట్రాసిటీ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: డీవీఎంసీ సభ్యుడు లక్ష్మీకాంత్
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 30 (మన భారత్): ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వాటిని పరిరక్షించుకోవాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు లక్ష్మీకాంత్ అన్నారు. ఇంద్రవెల్లి మండలం సమక గ్రామపంచాయతీ పరిధిలోని పాటగూడలో మండల తహసీల్దార్ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు వివక్ష, భూ ఆక్రమణలు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన రక్షణలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని నిబంధనలపై అర్హులైన ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
కార్యక్రమంలో గ్రామస్థులకు పౌర హక్కులు, చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా అందుబాటులో ఉన్న సహాయంపై అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా పరిష్కరించుకునే విధానాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సమక సర్పంచ్ రాజేష్, ఎంపీడీఓ మహేందర్, ఏఎస్ఐ నాగేశ్వర్, ఎస్డబ్ల్యూ వార్డెన్ రవీందర్, ఏఈఓ శ్రవ్య, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
