400 ఎకరాల్లో 70–80 శాతం వరకు నష్టం.. రైతులకు అండగా ఉంటాం: ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి
తలమడుగు, సెప్టెంబర్ 30 (మన భారత్): తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోయాబీన్ పంట దెబ్బతిన్న పొలాలను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
రుయ్యాడి గ్రామానికి చెందిన రైతులు మాల్వికా రకం సోయాబీన్ విత్తనాలను సాగు చేయగా, కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడం, మరికొన్ని చోట్ల మొక్కలు పచ్చిగానే ఉండిపోవడం, ఇంకొన్ని ప్రాంతాల్లో మొక్కలు ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల వివరాల ప్రకారం సుమారు 56 మంది రైతులు దాదాపు 400 ఎకరాల్లో ఈ రకం సోయాబీన్‌ను సాగు చేశారు. ప్రస్తుతం 70 నుంచి 80 శాతం వరకు పంట నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
పంట పరిస్థితిని పరిశీలించిన శ్రీకాంత్‌రెడ్డి రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం తలమడుగు గ్రామంలోని గోదాములను ఆయన పరిశీలించారు. రైతులకు మెరుగైన వసతులు కల్పించేందుకు రోడ్డు సౌకర్యం, కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు తదితర మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పంటను గోదాములకు తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
అక్టోబర్ 12 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు పారదర్శకమైన కొనుగోలు ప్రక్రియ, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులతో సమన్వయం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ సభ్యులు మద్దెల పోశెట్టి, కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ఏలుగు రాజన్న, వెంకట్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, సజ్జనపు కిషన్, రాకేష్‌రెడ్డి, దేవన్న, ప్రవీణ్‌రెడ్డి తదితరులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, రైతులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
