కుచలాపూర్ జెడ్పీ పాఠశాలకు ఐదు కంప్యూటర్ల విరాళం
ఆశ చారిటీ ఇంగ్లాండ్ ఆర్థిక సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ అందజేత
మన భారత్, సెప్టెంబర్ 28 ,తలమడుగు: విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తలమడుగు మండలం కుచలాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు ఐదు కంప్యూటర్లను విరాళంగా అందించారు. ఆశ చారిటీ ఇంగ్లాండ్ ఆర్థిక సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కంప్యూటర్లను పాఠశాలకు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి పాల్గొని కంప్యూటర్లను పాఠశాల ప్రతినిధులకు అందజేశారు. విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడంలో కంప్యూటర్లు ఎంతో ఉపయోగపడతాయని, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడానికి ఇవి దోహదపడతాయని తెలిపారు.
ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు దిగంబర్, ప్రశాంత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆధునిక విద్యా వనరులు అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యాల్లో భాగమని తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్ల వినియోగం ద్వారా విద్యార్థులు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు డిజిటల్ విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పాఠశాలకు కంప్యూటర్లు అందించడంపై గ్రామ సర్పంచ్ మూడెపు వెంకన్న, ఉపసర్పంచ్ రాఖి దీపక్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సునీత హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థులకు ఇలాంటి సదుపాయాలు అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న, పెద్దలు, పాఠశాల సిబ్బంది, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరిస్తున్న ఆశ చారిటీ ఇంగ్లాండ్, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులకు పాఠశాల వర్గాలు కృతజ్ఞతలు తెలిపారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
