manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 2:59 pm Editor : Editor Vishal Kumar

కాగితాల్లోనే కాలువల పూడికతీత.!

కాగితాల్లోనే కాలువల పూడికతీత: రెండు రోజుల వర్షానికే నీటమునిగిన మండపేట మెట్ట గ్రామాలు

మన భారత్, మండపేట:

గోదావరికి వరద రాలేదు.. చెరువుల కట్టలు తెగలేదు.. అయినా ఆ ఊళ్లు మాత్రం సముద్రాన్ని తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండల పరిధిలోని మెట్ట ప్రాంత గ్రామాలు కేవలం రెండు రోజుల పాటు కురిసిన సాధారణ వర్షాలకే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా ద్వారపూడి, జెడ్.మేడపాడు, కేశవరం తదితర గ్రామాల్లో ఎటుచూసినా వరద నీరే దర్శనమిస్తోంది. నిధులు కాగితాల్లో ఖర్చవుతున్నా, క్షేత్రస్థాయిలో కాలువలు పూడికతో మూసుకుపోవడమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోకాళ్ల లోతులో నిలిచిన నీరు.. కంటిమీద కునుకులేని ప్రజలు

రెండు రాత్రులుగా కురిసిన వర్షపు నీరు గ్రామాల్లోని ప్రధాన రహదారులను, నివాస ప్రాంతాలను ముంచెత్తింది. పలు కాలనీలలో మోకాళ్ల లోతు నుంచి నడుము లోతు వరకు నీరు నిలిచిపోయింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి సైతం మురుగునీరు చేరడంతో రెండు రోజులుగా ప్రజలు జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో పాటు కలుషిత నీటితో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

రికార్డుల్లోనేపనులు.. క్షేత్రంలో శూన్యం!

వర్షాకాలానికి ముందే డ్రైనేజీల నిర్వహణ చేపట్టినట్లు సంబంధిత శాఖలు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు.

ఉపాధి హామీ నిధులు: వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా కాలవలు, బోదుల పూడికతీత పనులు చేపట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు

ఇరిగేషన్ & డ్రైనేజీ శాఖలు: నీటి సంఘాల ఆధ్వర్యంలో మేజర్ డ్రైన్ల నిర్వహణ పనులు పూర్తయినట్లు చూపించారు.

పంచాయతీ రాజ్ శాఖ: గ్రామాల్లో అంతర్గత మురుగు కాలువలు, సైడ్ డ్రైన్ల పూడికతీత పనులు తూతూమంత్రంగా ముగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ

ప్రభుత్వ లెక్కల్లో కాలువలన్నీ శుభ్రమైనా, వాస్తవానికి మురుగునీరు సాఫీగా బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతోనే మెట్ట ప్రాంతాలు చెరువులుగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు.

శాఖల మధ్య సమన్వయ లోపం.. సమగ్ర విచారణకు డిమాండ్

రెవెన్యూ, ఇరిగేషన్, డ్రైనేజీ, పంచాయతీ రాజ్ శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్య ఏటేటా తీవ్రతరమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఈ నాలుగు శాఖల పరిధిలో డ్రైనేజీ పనుల కోసం మంజూరైన నిధులు, క్షేత్రస్థాయిలో జరిగిన ఖర్చుపై ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక మోటార్లతో ముంపు నీటిని తోడివేయాలని, డ్రైనేజీ సమస్యకు శాశ్వత ఇంజినీరింగ్ పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి