manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 12:38 am Editor : manabharath

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి..

ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు గాల్లో దీపాలే!

ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ దందాకు అడ్డాగా మారిన నెట్‌వర్క్ ఆసుపత్రి? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా అంటూ వైద్య ఆరోగ్య శాఖపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.

మన భారత్, చీపురుపల్లి (విజయనగరం జిల్లా):విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ బాబూజీ హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా చెలగాటమాడుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలేకపోయినా, ఈ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవలు) నెట్‌వర్క్ గుర్తింపు ఎలా లభించిందనే దానిపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకేమో కార్పొరేట్ సేవలు.. తీరా లోపలికి వెళ్తే కనీస వైద్య సదుపాయాలు కరువై, రోగుల పాలిట ఈ హాస్పిటల్ ‘యమపురి’గా మారుతోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఐసీయూ లేదు.. అత్యవసర సేవలు శూన్యం!ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోకి వచ్చే ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను కాపాడేందుకు ఐసీయూ (ICU) సదుపాయం, క్రిటికల్ కేర్ విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ, బాబూజీ హాస్పిటల్‌లో ఐసీయూ సదుపాయం అసలు శూన్యం. ప్రమాద వశాత్తూ లేదా తీవ్ర అనారోగ్యంతో ఎమర్జెన్సీ కేసు వస్తే, కనీసం పట్టించుకునే నాథుడే ఇక్కడ కరువయ్యాడు. కేవలం డబ్బులు గుంజడమే ధ్యేయంగా బోర్డులు తగిలించుకున్నారు తప్ప, ప్రాణాలు కాపాడే ఏ ఒక్క పరికరమూ ఇక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం.ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ దందా.. డ్యూటీ డాక్టర్లే ఉండరు!ఈ హాస్పిటల్‌లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) వైద్యులు తమ వద్దకు వచ్చే పేషెంట్లను, కేసులను కమిషన్ల కోసం ఈ బాబూజీ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు ఇక్కడికి వచ్చి సర్జరీలు (ఆపరేషన్లు) చేసి, చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత పేషెంట్‌ను పర్యవేక్షించడానికి కనీసం ఒక్క డ్యూటీ డాక్టర్ కూడా ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం లేదు.రాత్రి వేళల్లో ‘వాట్సాప్’ వైద్యం.. ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?రాత్రి సమయంలో రోగులకు ఏ రకమైన అత్యవసర పరిస్థితి ఎదురైనా ఇక్కడ ఘోరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. నైట్ డ్యూటీలో ఉండే కొంతమంది నర్సింగ్ స్టాఫ్.. రోగి పల్స్, బీపీ లేదా ఇతర ఇబ్బందుల వివరాలను వాట్సాప్‌ (WhatsApp) లో మెసేజ్ లేదా ఫోటోల రూపంలో డాక్టర్లకు చేరవేస్తున్నారు. అక్కడ ఉన్న డాక్టర్లు వాట్సాప్‌లో చూసి ఏ మందులు వేయాలో తిరుగు సమాధానం ఇస్తున్నారు. ఉదయం డాక్టర్ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చేవరకు రోగులకు ఈ ‘వాట్సాప్ ట్రీట్‌మెంట్’ మాత్రమే దిక్కు. ఈ లోగా ఏదైనా అనర్థం జరిగి పేషెంట్ ప్రాణాలు కోల్పోతే.. భగవంతుడిపై భారం వేయడం తప్ప యాజమాన్యానికి ఎలాంటి పట్టింపు లేదు. వైద్యులే లేని ఆసుపత్రికి ప్రభుత్వ పథకాల అనుమతులు ఎలా ఇచ్చారో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.అధికారులు నిద్రమత్తు వదలాలి: స్థానికుల డిమాండ్వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదలాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి, ఎవరైనా ప్రాణాలు కోల్పోయాక.. “చేతులు కాలాక ఆకులు పట్టుకునే” చందంగా విచారణలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని హెచ్చరిస్తున్నారు. తక్షణమే జిల్లా వైద్యాధికారులు (DM&HO) స్పందించి, చీపురుపల్లి శ్రీ బాబూజీ హాస్పిటల్‌ను తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఆసుపత్రి లైసెన్స్‌తో పాటు ఆరోగ్యశ్రీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.