manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 11:45 pm Editor : manabharath

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆయుర్వేద వైద్య విధానంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సంప్రదాయ వైద్య విధానాల ప్రాధాన్యతను చాటిచెప్పే ఉద్దేశంతో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయుష్‌ డైరెక్టర్‌, హైదరాబాద్‌, ఆర్డీడీ వరంగల్‌ వారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌ ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ‘పోషణ్‌ మాహ్‌’ కార్యక్రమం సహకారంతో ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సతీష్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి, మెప్మా పీడీ రాజు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి మిల్కా, ఆయుష్‌ జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ కస్తాల చంద్రశేఖర్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, భగవాన్‌ ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయుర్వేద చికిత్సపై అవగాహన అవసరం

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. కరోనా కాలం నుంచి ఆయుర్వేద వైద్య విధానాలపై ప్రజల్లో మరింత ఆసక్తి, ఆదరణ పెరిగిందని తెలిపారు. సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ పూర్వకాలంలో ప్రజలు తమ ఇళ్లలో లభించే వివిధ ఔషధ మొక్కలు, సహజ పదార్థాలతో చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యానికి మళ్లీ ఆదరణ పెరుగుతోందని అన్నారు. ‘పోషణ్‌ మాహ్‌’ కార్యక్రమంతో పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సేవలు అందుతున్నాయని అభినందించారు.

200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు

శిబిరంలో ఆదిలాబాద్‌ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు ఆయుర్వేద వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 200 మందికి పైగా రోగులకు నాడీ పరీక్షలు, ఇతర ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

అనంతరం ముఖ్య అతిథులు ఆయుష్‌ శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. హెర్బల్‌ గార్డెన్‌లో పెంచుతున్న ఔషధ మొక్కలను పరిశీలించి వాటి ఉపయోగాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్లు ప్రదర్శించిన వివిధ ఆసనాలను తిలకించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి శిబిరానికి హాజరైన ఆయుర్వేద వైద్యులను అతిథులు శాలువాలతో సత్కరించారు. ఆయుర్వేద వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో వైద్యులు, ఆయుష్‌ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు.

కార్యక్రమంలో డిప్యూటీ నోడల్‌ అధికారి డాక్టర్‌ సంతోష్‌, డాక్టర్‌ అవినాష్‌ రాథోడ్‌, కన్వీనర్‌ డాక్టర్‌ ఇక్రముద్దీన్‌, డీపీఎం డాక్టర్‌ ప్రీతల్‌ రాథోడ్‌, ఆయుర్వేద వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఆయుష్‌ సిబ్బంది, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, ఆశా కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.