manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 1:33 pm Editor : manabharath

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌ చౌహాన్‌

మన భారత్‌, సెప్టెంబర్‌ 21, భీంపూర్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా అధ్యక్షుడు సునీల్‌ చౌహాన్‌ ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయంగా అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు.

భీంపూర్‌ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం తపస్‌ 2026 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ, పెండింగ్‌ డీఏల విషయంలో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థికంగా న్యాయం చేయాలని అన్నారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తపస్‌ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగులు సంఘటితంగా ఉండి తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు తపస్‌ సభ్యత్వాన్ని స్వీకరించారు. సంఘం బలోపేతానికి ఉపాధ్యాయులు సహకరించాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌ చౌహాన్‌, జిల్లా కార్యదర్శి బచ్చువార్‌ నారాయణ, భీంపూర్‌ మండల తపస్‌ అధ్యక్షుడు ఎర్రోజు జయసారథి, ప్రధాన కార్యదర్శి బందూకుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి