manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 12:23 pm Editor : manabharath

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య..

కజ్జర్ల పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ తరగతి గది ప్రారంభం
మన భారత్, సెప్టెంబర్21, తలమడుగు:
“చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు. ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇప్పుడు నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి” అని కజ్జర్ల గ్రామ సర్పంచ్ ఎల్మ నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతి గదిని సోమవారం ఆయన రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్మ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్‌రెడ్డి  ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 4,000కు పైగా ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించడం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు అని కొనియాడారు ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల ఆర్థిక భారం తప్పుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లోనే చిన్నారులకు ఆటపాటలతో కూడిన అత్యుత్తమ విద్య అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. కజ్జర్ల ప్రాథమిక పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున ఎల్లవేళలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, గ్రామ పెద్ద చింతలపల్లి దేవారెడ్డి, మాజీ సర్పంచ్ మొట్టే వెంకటమ్మ-కిరణ్, వార్డు సభ్యులు మల్లారపు శీలా-గోవింద్, సంగర్తి లక్ష్మీ-రామచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అలుగంటి కిష్టమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము జ్యోతి పాల్గొన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయురాలు ఇ. ఎలిజిబెత్ రాణి, ప్రీ-ప్రైమరీ టీచర్ అచ్చు నవీన, ఆయా ఎంబడి వాణిశ్రీ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నూతన విద్యావిభాగం ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేశారు.

మీ గొంటిముక్కుల  ప్రసాద్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.