manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 4:04 pm Editor : Editor Vishal Kumar

బాల్యంలో సత్ప్రవర్తన అలవర్చుకోవాలి

బాల్యం నుంచే క్రమశిక్షణ, సత్ప్రవర్తన అలవర్చుకోవాలి

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి

బాసర ట్రిపుల్‌ఐటీలో జిల్లా విద్యార్థులు అధిక సీట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, సెప్టెంబర్19, తలమడుగు: బాల్యం నుంచే విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నైతిక విలువలు, నాణ్యమైన విద్యను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’ కార్యక్రమంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ పోషణ్ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు.

పోషకాహార స్టాళ్ల పరిశీలన

పోషణ్ మాసం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ఫుడ్ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. పౌష్టికాహారం, సమతుల ఆహారం ప్రాధాన్యతను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు.

పీఎం శ్రీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, ఆసక్తులు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు. గంజాయి సాగు, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ట్రిపుల్‌ఐటీలో ఎక్కువ సీట్లు సాధించాలి

జిల్లాలోని విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలని అన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ విద్య, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, సామాజిక బాధ్యత వంటి విలువలను కూడా అలవర్చుకోవాలని అన్నారు.

గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ

పోషణ్ మాసం సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యాబోధనతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలు అందుతున్నాయని చెప్పారు.

ప్రజలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పోస్టులను త్వరలో భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, పరిశుభ్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రదర్శించిన నాటికలు, పాటలు, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోషణ్ మాసం ద్వారా లబ్ధి పొందిన మహిళలు తమ అనుభవాలు, అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రావు, సర్పంచ్ రాజన్న, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ సాయికిరణ్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు, సీడీపీవోలు సురేఖ, సౌందర్య, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి